విత్తనాల నాణ్యతలో రాజీ పడొద్దు: సీఎం జగన్‌

31 Oct, 2019 17:29 IST|Sakshi

అన్ని గ్రామాల్లో భూసార పరీక్షా కేంద్రాలు

చిరుధాన్యాలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌

మరో 2 వేల గ్రామాల్లో వాతావరణ పరిశీలన కేంద్రాలు

వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి  కురసాల కన్నబాబు, అధికారులు హాజరయ్యారు. సమీక్షా సమావేశానికి ముందు భూసార పరీక్ష పరికరాలను సీఎం పరిశీలించారు. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు జిల్లాల వారీగా నమోదయిన వర్షపాతం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా 1.4 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదయిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గ్రామ సచివాలయాల పక్కనే రైతుల కోసం పెడుతున్న వర్క్‌షాపులను మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. పురుగుల మందుల దుకాణాల్లో నాణ్యమైన ఉత్పత్తులను విక్రయించే విధంగా చర్యలు  చేపట్టాలని చెప్పారు.

ప్రతి జిల్లాకు టోల్‌ ఫ్రీ నంబర్‌..
పంటలపై వచ్చే సమస్యలను నివేదించడానికి గ్రామ పరిధిలోనే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి జిల్లాకు ఒక టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెడుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వివరించగా.. దీంతోపాటు గ్రామ సచివాలయాల్లోనే ఈ సమస్యకు పరిష్కారం లభించేలా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. క్వాలిటీ పరీక్షలు చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్క్‌షాపులో రైతులకు సలహాలు, సూచనలు, శిక్షణ ఇవ్వాలని కోరారు. విత్తనాల కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం నుంచి, గోడౌన్లలో నిల్వ చేయడం, అక్కడ నుంచి గ్రామాల్లోని దుకాణాలకు చేర్చడం, చివరకు రైతులకు అందించడం వరకూ ప్రతి ప్రక్రియలో పారదర్శకత, ఉత్తమ ప్రమాణాలు పాటించాలని సీఎం సూచించారు. అధికారులందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు.

మంచి పని చేస్తే ఓర్వలేరు..
‘ప్రతిపక్ష నేత చంద్రబాబు లాంటివారు అదే పనిగా వేలెత్తి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా మంచి పని జరుగుతుందంటే చూసి ఓర్వలేరు. ఏ మాత్రం పొరపాటు జరిగినా అంతా అవినీతి అని, అన్యాయం జరిగిపోయిందని.. నానా రకాలుగా మాట్లాడి విష ప్రచారం చేస్తారని’ సీఎం అన్నారు. అందుకే గ్రామ సచివాలయాల పక్కనే ఏర్పాటు చేసే దుకాణాల్లో ఎరువులు, పురుగు మందులు, విత్తనాల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని స్పష్టం చేశారు. ఎవ్వరూ కూడా నాణ్యత విషయంలో వేలెత్తి చూపించకూడదన్నారు. నాణ్యతకు ప్రభుత్వం తరపున గ్యారెంటీ ఇస్తున్నామనే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు. రైతులు పంటల సాగుకు సంబంధించి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం, సలహా ఇచ్చేలా ఉండగలిగే వ్యక్తి రైతు  భరోసా కేంద్రంలో ఉండాలన్నారు.

ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి..
రైతుల కోసం చేపట్టే కార్యక్రమాలను ధరల స్థిరీకరణ నిధికి, ప్రకృతి వైపరీత్యాల నిధికి లింక్‌ చేయాలని కోరారు. దీనివల్ల రైతులకు పూర్తిగా భద్రత ఉంటుందన్నారు. ఖరీఫ్‌లో పంట నష్టం జరిగితే రబీ ప్రారంభానికి ముందే పరిహారం, బీమా అందించాలన్నారు. ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ కల్పించే విషయంలో కూడా వర్క్‌షాపులో సలహాలు ఇవ్వాలన్నారు. వాల్‌మార్టు, ఐటీసీ లాంటి సంస్థలతో కలిసి ముందుకు సాగేలా ప్రణాళిక వేసుకోవాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఈ భారీ సంస్థలు మరింత విలువను జోడించి మంచి మార్కెట్‌ను కల్పిస్తారని వెల్లడించారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు, తదితర విక్రయాల కోసం ఇ-కామర్స్‌ తీసుకురావాలని సీఎం సూచించారు.

చిరుధాన్యాల సాగు ప్రోత్సాహానికి ప్రమోషనల్‌ ఇన్సెంటివ్‌లు..
అగ్రిల్యాబ్స్‌ నిర్మాణంపై సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది. తుపాన్లు, గాలులను దృష్టిలో పెట్టుకుని డిజైన్లు రూపొందాలని సీఎం ఆదేశించారు. కోస్తా ప్రాంతాల్లో తుపాన్లు అధికంగా వస్తున్నాయని, భవనాల నిర్మాణాల కోసం చేస్తున్న ప్లానింగ్‌లోనే జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. మిల్లెట్స్‌ సాగు విస్తీరం పెంచడంపైనా కూడా సమావేశంలో చర్చ జరిగింది. చిరుధాన్యాల సాగు ప్రోత్సాహానికి ప్రమోషనల్‌ ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని సీఎం తెలిపారు.

2 వేల గ్రామాల్లో వాతావరణ పరిశీలన కేంద్రాలు..
ఆర్గానిక్‌ పంటలు పండించే రైతుల ఉత్పత్తులకు అధిక ధరలు వచ్చేలా చూడాలని వెల్లడించారు. చిరు ధాన్యాలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ కల్పించాలన్నారు. సాగులో మెళకువల కోసం వైఎస్సార్‌ పొలంబడి కార్యక్రమాలు, ప్రొసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ శాఖ పరిధిలోకి పంటల బీమా రైతులకు రక్షణ ఉండాలని సీఎం తెలిపారు. రైతులకు మనం అండగా ఉండాలని, ఇస్రో సహా ఇతర సాంకేతిక సంస్థల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో అన్నిపంటలకు క్రాప్‌ రిజిస్ట్రేషన్‌  కచ్చితంగా అయ్యేలా చూడాలని తెలిపారు. వ్యవసాయం, రెవెన్యూ శాఖలు కలిసి పనిచేయాలని కోరారు. పంటల బీమా కోసం గ్రామాన్ని ఒక యూనిట్‌గా చేయాలని సీఎం ఆదేశించారు. 2 వేల గ్రామాల్లో వాతావరణ పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేయాలని  సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

మరిన్ని వార్తలు