మీ కోసం ఎందాకైనా

16 Apr, 2015 02:54 IST|Sakshi
మీ కోసం ఎందాకైనా

 ‘పట్టిసీమ’పై పొలికేక
 - గోదావరి జిల్లాల రైతులకు వైఎస్ జగన్ భరోసా
 -  పట్టిసీమపై పోరాడదాం
 - పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యంపై నిలదీద్దాం
 - పెండింగ్ ప్రాజెక్టులపై సమరభేరి మోగిద్దాం
 - గోదావరి జిల్లాల పర్యటనలో వైఎస్ జగన్ పిలుపు
 - అడుగడుగునా జన నీరాజనం
 - తొలిరోజు బస్సుయాత్ర విజయవంతం


సాక్షి ప్రతినిధి, ఏలూరు :గోదావరి జిల్లాల ప్రజలు, రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ఎన్నిపోరాటాలకైనా సిద్ధమని వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రైతుల కోసం ఎందాకైనా, దేనికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో అవినీతిని ఎండగట్టేందుకు చేపట్టిన ‘ప్రాజెక్టుల సందర్శన బస్సుయాత్ర’ తొలి రోజైన బుధవారం ఉభయగోదావరి జిల్లాల్లో జయప్రదమైంది.

 హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలతో కలసి ఆయన ధవళేశ్వరం ఆనకట్టను సందర్శించారు. అనంతరం విజ్జేశ్వరం వద్ద జిల్లాలోకి ప్రవేశించారు. అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి గోదావరి గట్టు వెంబడి బస్సుయాత్ర నిర్వహించిన జగన్‌కు జిల్లా ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ఎక్కడికక్కడ రైతులు వేలాదిగా పాల్గొన్నారు.
 
గ్రామగ్రామాన వేచివున్న జనం
పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకునే వరకూ ప్రతి గ్రామంలోనూ జగన్ కోసం ప్రజ లు వేచి చూడటంతో ఆయన ఎక్కడికక్కడ బస్సు నిలిపి వారిని పలకరించారు. వారి సమస్యలు వింటూ ముందుకు సాగారు. యాత్ర ఆలస్యమవుతున్నా లెక్కచేయక ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకు వెళ్లడంతో పోలవరానికి చేరుకునేటప్పటికి సాయంత్రం 4 గంటలు దాటింది. పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు వచ్చిందని ఇంజినీర్ల నుంచి ఆరా తీశారు. పోలవరం నిర్వాసితులకు లక్షన్నర పరిహారం ఇచ్చేందుకు ఏళ్లు గడుస్తున్నా ముందుకురాని సర్కారు పట్టిసీమ ప్రాజెక్టుతో భూములు కోల్పోయే రైతులకు 19.50 లక్షలు ఎలా ఇస్తామంటోం దని నిలదీశారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. అక్కడి నుంచి పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణ ప్రాంతానికి వెళ్లి పనులను పరిశీలించారు.
 
సర్కారుపై సమరభేరి
అనంతరం పట్టిసీమలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రైతులతోనే జగన్ మాట్లాడించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై రైతుల అభిప్రాయాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తామని ప్రకటించారు. పోల వరం ప్రాజెక్టు పూర్తిచేసే వరకూ అడుగడుగునా ఉద్యమం చేయడానికి వెనుకాడేది లేదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేసి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో జిల్లా ప్రజలు చేసే ఉద్యమాలకు తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయిం చడానికి చేసే పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, జిల్లా ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామని అన్నారు. రాష్ట్రం లోని అన్ని జిల్లాలను, అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసే బృహత్తర పథకం పోలవ రం ప్రాజెక్టును పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి, కేవలం టీడీపీ నాయకుల జేబులు నింపడానికే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడుకి బుద్ధి వచ్చేవిధంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంద ని జగన్ పిలుపునిచ్చారు.
 
జగన్ యాత్రతో రైతుల్లో స్థైర్యం
పట్టిసీమ నిర్మాణంతో కంటిమీద కునుకులేకుండా ఆందోళన చెందుతున్న తమకు వైఎస్ జగన్ యాత్రతో భరోసా వచ్చిందని రైతులు రచ్చబండ సాక్షిగా ప్రకటించారు. తమ కోసం పోరాడే నేత ఉన్నారనే ధైర్యం వచ్చిందని వ్యాఖ్యానించారు. అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డు మార్గంలో తాళ్లపూడి, దేవరపల్లి, నల్లజర్ల మీదుగా విజయవాడ వెళ్లారు.

మరిన్ని వార్తలు