పత్తి రైతులను పట్టించుకోరా?

8 Nov, 2017 04:30 IST|Sakshi
పత్తి రైతుల సమస్యలు వింటున్న వైఎస్‌ జగన్‌

 ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైఎస్‌ జగన్‌

ప్రతిపక్షనేతకు తమ గోడును చెప్పుకున్న పత్తి రైతులు

రాయచోటి రూరల్‌ /చింతకొమ్మ దిన్నె: రాష్ట్రవ్యాప్తంగా 6.36 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాల పాలైనా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు ఇంత నిర్దయగా వ్యవహరిస్తుంటే రైతులేం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. మీరైనా ఈ పరిస్థితి చూడండని మీడియా ప్రతినిధుల ముందు ఆవేదన చెందారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రెండవ రోజు మంగళవారం సాయంత్రం ఆయన వేంపల్లె మండలంలో పత్తి రైతుల బాధలను ఆలకించారు. వారి అభ్యర్థన మేరకు పొలాలకు వెళ్లి పరిశీలించారు. మూడెకరాల్లో రూ.లక్ష ఖర్చు పెట్టి సాగు చేసి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశ పడితే అకాల వర్షాలు, తెగుళ్లు పత్తి పంటను పూర్తిగా తినేశాయని వేంపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కౌలు రైతు కుందాజయన్న కన్నీరు మున్నీరయ్యారు. తమ పొలంలో కూడా పత్తి పంటది ఇదే పరిస్థితి అనీ, పంటను నమ్ముకుని నిలువునా మునిగి పోయామని పెండ్లిమర్రికి చెందిన మరో రైతు కొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను చూసిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ తీవ్రంగా చలించారు.  

మూడెకరాలకు క్వింటా కూడా రాలేదు
వేంపల్లె మండలం వైఎస్‌ నగర్‌కు చేరుకున్న జగన్‌ను పత్తి రైతు జయన్న కలిశారు. తన పరిస్థితి చూడాలని వేడుకున్నారు. దీంతో జగన్‌ పత్తి పంట సాగుచేసిన భూమిలోకి వెళ్లారు. 10 క్వింటాళ్లు పండాల్సిన మూడు ఎకరాల భూమిలో క్వింటాలు దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేని విషయాన్ని గుర్తించారు. మూడు ఎకరాల భూమి గుత్తకు తీసుకుని లక్ష అప్పు చేసి పత్తి సాగు చేశానని జయన్న కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. ఎకరాకు  రూ.8వేలు లెక్కన  కౌలు  లెక్క (డబ్బు) కూడా ఇచ్చానని చెప్పారు. పంట చేతికొచ్చి అప్పులు తీర్చి కొంచమైనా మిగులుతుందని అనుకుంటా ఉంటే ఉన్నట్టుండి పడిన వానలు, తెగుళ్లు, కాయతొలిచే పురుగులు కాయలోని పత్తినంతా నాశనం చేశాయని జగన్‌కు తన పరిస్థితి వివరించుకున్నారు. తనకు నలుగురు ఆడబిడ్డలని,  పంటలు పెట్టి అంతా నష్టపోతే సంసారాన్ని ఎట్టా సాకాలో మీరే చెప్పండని తీవ్రంగా బాధపడ్డారు. అన్నిచోట్లా పత్తిరైతుల పరిస్థితి ఇలానే ఉందని,  ప్రభుత్వంపై నష్టపరిహారం అందించేలా పోరాడాలని పెండ్లిమర్రి మండలానికి చెందిన మరో రైతు కొండారెడ్డి కోరారు. 

ఇలాంటి ప్రభుత్వాన్ని ఎవ్వరూ క్షమించరు
ఈ ఏడాది రాష్ట్రంలో 6.36 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగు అయ్యిందని, 80శాతం మేర రైతులు పెట్టుబడులు కూడా నష్టపోయారని జగన్‌కు అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి వివరించారు. వైఎస్సార్‌ జిల్లాలో 24వేల హెక్టార్లలో పత్తి పంట సాగు  చేసిన రైతులు పూర్తిగా నష్టపోయారని చెప్పారు. పత్తి పంట నష్టంపై కౌలు రైతులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలసి రైతు సంఘం నాయకులు జిల్లా  కలెక్టర్‌ దృíష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని బాధిత రైతులు చెప్పారు. నష్టపోయిన పత్తిపంటను ఏ అధికారీ ఇప్పటివరకు పరిశీలించలేదని వాపోయారు. ప్రభుత్వం, అధికారులు ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే రైతులు ఎవరి దగ్గరికి వెళ్లాలని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత దారుణంగా వ్యహరిస్తోందో చూడండని మీడియా ప్రతినిధులను కోరారు. ఇంత నీచమైన ప్రభుత్వాన్ని ఎవరూ ఎప్పటికీ క్షమించరనీ, అధైర్య పడకుండా ఉండాలని, అందరికీ మంచి రోజులు వస్తాయని రైతులను ఓదార్చారు. జగన్‌ వెంట మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్‌ బాషా, రవీంద్రనాథరెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, కడప, కర్నూలు జిల్లాల వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు సంబటూరు ప్రసాదరెడ్డి, శివరామిరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఉన్నారు.

ప్రజాసంకల్ప యాత్రలో కత్తి 
వేంపల్లెలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొని జననేత జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లెకు చెందిన కత్తి రమేష్‌ అనే మరుగుజ్జు ఉత్సాహంగా తరలివచ్చాడు. అతడిని చూసిన జగన్‌ ఆప్యాయంగా పలకరించి తనతోపాటు పాదయాత్రలో నడిచేందుకు అవకాశం కల్పించారు. 

జగన్‌ దృష్టికి ఏఎన్‌ఎం, ఆశావర్కర్ల సమస్యలు 
రాయచోటి రూరల్‌: వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు తమ సమస్యలను మంగళవారం ప్రజాసంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. సెకండ్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయాలని, ఆశావర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

చంటి బిడ్డలతో ఎదురుచూపులు
జగన్‌మోహన్‌రెడ్డి రాకకోసం వేంపల్లె మండలం రాజారెడ్డి కాలనీ వద్ద మహిళలు చంటి బిడ్డలతోసహా గంటన్నరపాటు ఎదురు చూశారు. జగనన్న వస్తాడని, తమ బిడ్డలను దీవిస్తాడని వేచి ఉన్నట్లు వారు చెప్పారు. అక్కడికి చేరుకున్న జగన్‌ చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు. దీంతో వారి తల్లులు సంబరపడిపోయారు. 

జగన్‌కు చిన్నారి ముద్దు 
వేంపల్లె పట్టణంలో జరిగిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన వారితో జగన్‌ మాట్లాడారు. ఈ సమయంలో చంటిపిల్లాడికి ఒక అరుదైన అవకాశం దొరికింది. అతడు తనను దగ్గరకు తీసుకున్న జగన్‌కు ముద్దు పెట్టాడు. పిల్లలను ముద్దాడే జగన్‌ను తానే ముద్దాడానన్న సంతోషం ఒక బాబుకు దక్కింది. అక్కడున్న జనాలు ఈ సంఘటనను ఆసక్తిగా తిలకించారు. 

బియ్యం ఇచ్చి రెండున్నర ఏళ్లు అయింది..
వేంపల్లె పట్టణంలో 13వ వార్డుకు చెందిన ఎల్లమ్మ అనే వృద్ధురాలు తనకు రేషన్‌షాపులో బియ్యం ఇచ్చి రెండున్నర ఏళ్లు అయింది నాయనా అంటూ తన సమస్యను జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పుకుంది. వేలిముద్ర పడలేదని పలుసార్లు తిప్పుకున్నారని, చివరకు బియ్యం, కిరోసిన్, చెక్కర, పామాయిల్‌ ఏవీ లేకుండా చేశారు నాయనా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె సమస్యను సావధానంగా విన్న జగన్‌ మనం ఎంతో దుర్మార్గమైన పాలనలో ఉన్నామని అన్నారు. వృద్ధురాలి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులకు సూచించారు. 

బడుగుల సంక్షేమం జగన్‌తోనే సాధ్యం 
‘‘మాది విజయవాడ. పాన్‌ షాప్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నాలాంటి లక్షలాది మందికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సాయపడ్డారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ‘108’ లాంటివి ఇప్పుడు మూలనపడ్డాయి. అవి మళ్లీ అమలు కావాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. బడుగు బలహీన వర్గాల సంక్షేమం జగన్‌తోనే సాధ్యం. అందుకే నేను సైతం పాదయాత్రలో పాల్గొంటున్నా.. జగన్‌ మాకు ఆదర్శం. ఆ అభిమానంతోనే స్వయంగా ఇడుపులపాయకు వచ్చా’’ 
– పరమపటేల్‌ శ్రీనివాస్, సింగ్‌నగర్, విజయవాడ  

జగన్‌ను కలసిన పులివెందుల నాయకులు
వేంపల్లె: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండవ రోజు పాదయాత్ర సందర్భంగా మంగళవారం ఉదయం వేంపల్లె పట్టణంలోని మాలవంక వద్ద ఏర్పాటు చేసిన బస వద్ద పులివెందుల నియోజకవర్గ నాయకులతో మాట్లాడారు. అందర్నీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఏడాది ఆగితే మన ప్రభుత్వం వస్తుందని, అన్ని సమస్యలను తీరుస్తానని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. 

జగన్‌కు కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి
వేంపల్లె నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అధికారంలోకి రాగానే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌)ను రద్దు చేస్తానని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రకటించడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, ఏపీఎన్జీవోస్‌ మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం వైఎస్‌ జగన్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు