పల్లె జనంతో మమేకం

9 Jul, 2015 03:29 IST|Sakshi

 పులివెందుల, సాక్షి, కడప : పులివెందుల నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఓపికగా ప్రజలు చెప్పే సమస్యలు ఆలకిస్తూ త్వరలో మంచి రోజులు వస్తాయంటూ వారికి ధైర్యం చెప్పారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు పట్టించుకోని తీరును విమర్శిస్తూ.. పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధికారం చేపట్టి ఏడాది దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన వైనాన్ని ఎండగట్టారు. ప్రజలు పలు గ్రామాల్లో పింఛన్లు, రుణాలు మాఫీ కానీ వైనం, ఇంటి బిల్లులు రాని పరిస్థితి, నిరుద్యోగ భృతి.. తదితర సమస్యలను ప్రతిపక్ష నేతకు విన్నవించారు. అండగా తానుంటానని, అసెంబ్లీలో సమస్యలపై గళమెత్తుతానని వారికి ధైర్యం చెప్పారు. చంద్రబాబు మెడలు వంచైనా హామీల అమలుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.  
 మూడు కుటుంబాలకు పరామర్శ
 సింహాద్రిపురం మండలం అగ్రహారం వద్ద మే 30వ తేదీన విద్యుత్ తీగలు తగిలిన ప్రమాదంలో చనిపోయిన కృష్ణమోహన్‌రెడ్డి, శేషారెడ్డి కుటుంబాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. తొలుత కసనూరు గ్రామంలోని మృతుడు కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
 
 కృష్ణమోహన్‌రెడ్డి సతీమణి శ్రావణి.. వైఎస్ జగన్‌ను చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు. కుమారులు ఫంకజ్ సాయిరెడ్డి, బాబుల పరిస్థితి గురించి వైఎస్ జగన్ వాకబు చేశారు. చదువు పరంగా తానుంటానని, అధైర్యపడొద్దని ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం అగ్రహారం గ్రామానికి చెందిన శేషారె డ్డి (ఇతనూ విద్యుదాఘాతంతో మృతి చెందాడు) కుటుంబాన్ని పరామర్శించారు. శేషారెడ్డి సతీమణి లక్ష్మిదేవి వైఎస్ జగన్‌ను చూడగానే విలపిస్తుండగా ఓదార్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పూర్తి స్థాయిలో ఆదుకుంటామని.. ధైర్యంగా ముందుకుపోవాలని ఆమెకు సూచించారు. వైఎస్‌ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు బొగ్గుడుపల్లె ప్రభాకర్‌రెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
 
 ఈ సందర్భంగా పార్టీకి ప్రభాకర్‌రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్‌ను చూడగానే ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు విలపిస్తుండటంతో దగ్గరకు తీసుకొని ఓదార్చారు. అంకాలమ్మ గూడూరులోని మాజీ సర్పంచ్ శివనారాయణరెడ్డి (మిద్దె కూలి మృతి చెందాడు) కుటుంబ సభ్యులను పరామర్శించారు.  శివనారాయణరెడ్డి సతీమణి, అంకాలమ్మ గూడూరు సర్పంచ్ పార్వతమ్మను ఓదార్చి ధైర్యం చెప్పారు.
 
 విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
 సింహాద్రిపురం మండలం అగ్రహారం సమీపంలో 33/11 కె.వి విద్యుత్ లైన్ నేలకు సమీపంలో ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతోనే రెండు కుటుంబాలు ఇబ్బందులకు గురయ్యాయని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాలి, వానకు విద్యుత్ స్తంభం ఒరిగిపోయి నేల స్థాయికి విద్యుత్ తీగలు చేరినా.. ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోకపోవడమే ప్రమాదానికి కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 24 గంటలు గడిచినా కూడా విద్యుత్ లైన్లను సరిచేయక పోవడంతోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రభుత్వం ఆ రెండు కుటంబాలను ఆదుకున్న పాపాన పోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
 
 రెండు వాటర్ ప్లాంట్లను
 ప్రారంభించిన జగన్
 వేంపల్లెలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం పక్కన ఉన్న వాటర్ ప్లాంటుతోపాటు సింహాద్రిపురం మండలం చవ్వారిపల్లె గ్రామంలో బుధవారం సాయంత్రం వాటర్ ప్లాంట్లను వైఎస్ జగన్ ప్రారంభించారు. పులివెందులలోని దినేష్ మెడికల్ సెంటర్‌లో పనిచేస్తున్న ప్రకాష్‌రెడ్డి కుమారుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి, సువర్ణల వివాహ మహోత్సవానికి అప్పట్లో హాజరు కాలేకపోయిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. బుధవారం మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్లి ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఇటీవలే వివాహమైన మరో జంట.. వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు రసూల్ సాహేబ్ కుమార్తె రేష్మిల, అల్లుడు రియాజ్‌లను ఆశీర్వదించారు.
 
 ఈ సందర్భంగా రసూల్  బంధువులతోపాటు, కుటుంబ సభ్యులను వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. సింహాద్రిపురం మండలం చవ్వారిపల్లె గ్రామంలో మాజీ సర్పంచ్ సుధాకర్‌రెడ్డి కుమార్తె శిరీష, అల్లుడు ఓబుళరెడ్డిల వివాహానికి హాజరుకాలేకపోయిన ప్రతిపక్షనేత బుధవారం వారి ఇంటికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. పులివెందులకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు మహమ్మద్ గౌస్‌కు ఇటీవలే బైపాస్ సర్జరీ జరిగిన నేపథ్యంలో జెండామాను వీధిలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు.
 
 రక్తదానం శిబిరం ప్రారంభించిన
 వైఎస్ జగన్
 వై.కొత్తపల్లె గ్రామంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు భాస్కర్‌రెడ్డి.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కట్ చేశారు. అనంతరం అక్కడే ఉన్న వృద్ధులతో చాలాసేపు మాట్లాడారు. చవ్వారిపల్లెలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ద్వారకనాథరెడ్డి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేస్తున్న వారిని అభినందించారు.
 
 వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు  
 వైఎస్‌ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు నేతలు కలిశారు. ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్ది, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అంజాద్ బాషా, మేయర్ సురేష్‌బాబు, జెడ్పీ చెర్మైన్ గూడూరు రవి తదితరులు ఆయన్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఇతర జిల్లాలకు చెందిన పలువురు నాయకులు సైతం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.
 

>
మరిన్ని వార్తలు