జూన్‌ 3 నుంచి వైఎస్సార్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నీ

26 May, 2018 09:00 IST|Sakshi
సమావేశంలో టోర్నమెంట్‌ వివరాలు వెల్లడిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

30వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానం

విజేతలకు రూ.3.75 లక్షల నగదు బహుమతులు

క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయం

చంద్రగిరి ఎమ్మెల్యే  డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

తిరుపతి రూరల్‌: చంద్రగిరి నియోజకవర్గంలోని యువతను ప్రోత్సహించేందుకు రాజకీయాలకు అతీతంగా జూన్‌ 3వ తేదీ నుంచి వైఎస్సార్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌–2018 నిర్వహించ నున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలోని వైఎస్సార్‌ క్రీడా మైదానంలోని పది మైదానాల్లో  ఈ టోర్నమెంట్‌ జరుగుతుందన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనే వారు ఈ నెల 30వ తేదీ లోపు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. తుమ్మలగుంటలోని వైఎస్సార్‌ క్రీడా మైదానంలో టోర్నమెంట్‌ ఏర్పాట్లపై శుక్రవారం క్రీడా ప్రముఖులు, ముఖ్య నేతలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకే  ఏటా వేలాది మందితో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వారై, కనీసం 15 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేం దుకు అర్హులని, ఎటువంటి ప్రవేశ రుసుం ఉండదని తెలిపారు.

ఏ పంచాయతీ క్రీడాకారులు ఆ పంచాయతీ తరుఫునే ఆడాల్సి ఉంటుందని, పాల్గొనే ప్రతి ఒక్కరూ చిరునామా, వయస్సు ధ్రువీకరణ పత్రాలను తప్పని సరిగా తీసుకురావాల్సి ఉంటుందని, ఒక పంచాయతీకి సం బంధించి ఎన్ని జట్లు అయినా పాల్గొన వచ్చని పేర్కొన్నారు. హార్డ్‌ టెన్నిస్‌ బాల్‌తో నిర్వహించే ఈ పోటీలు నాకౌట్‌ పద్ధతిలో జరుగుతాయని పేర్కొన్నారు. జూన్‌ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ 16 రోజుల పాటు జరుగుతుందని, క్రీడాకారులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి మ్యాచ్‌కు బెస్ట్‌ బ్యాట్స్‌మెన్, బెస్ట్‌ బౌలర్, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మెడల్స్, ట్రోఫీలను బహుకరించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు, పేర్ల నమోదుకు 98490 98747, 91009 26485, 93936 20318 నంబర్లను సంప్రదిం చవచ్చని కోరారు.

విజేతలకు భారీ బహుమతులు
టోర్నమెంట్‌లో విజేతలకు గతంలో ఎన్నడూ  లేని విధంగా భారీ బహుమతులను ఇవ్వనున్నారు. విజేతకు రూ.2 లక్షల నగదుతో పాటు భారీ ట్రోíఫీ, రన్నర్స్‌కు రూ.లక్ష నగదు,ట్రోఫీ, మూడో బహుమతి రూ.50 వేలు, నాలుగో బహుమతి రూ.25 వేలు, ట్రోఫీ బహూకరించనున్నారు.  పాల్గొనే ప్రతి జట్టుకు బ్యాట్,బాల్, ప్రతి క్రీడాకారుడికి సర్టిఫికెట్, పార్టిసిపెంట్‌ మెడల్‌ను అందించనున్నట్టు టోర్నమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి అవిలాల లోకనాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ క్రీడా ప్రతిభను చాటాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు