తుమ్మలపల్లిలో ఉద్రిక్తత

5 May, 2018 11:51 IST|Sakshi
ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి

సాక్షి, తుమ్మలపల్లి : దేశంలోనే అత్యధిక యురేనియం నిల్వలు కలిగిన తుమ్మలపల్లి యురేనియం ప్లాంటు వల్ల చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, గ్రామాల ప్రజలు యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌) ముందు శనివారం ధర్నాకు దిగారు.

ఫిబ్రవరిలో స్థానిక సమస్యలను ప్రజలు వైఎస్సార్‌ సీపీ దృష్టికి తీసుకొచ్చినట్లు అవినాష్‌ చెప్పారు. ‘యూసీఐఎల్‌లో ఉన్న టెయిల్‌ పాండ్‌లోని నీరు భూమిలోకి ఇంకి చుట్టుపక్కల పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. బోర్ల నుంచి వచ్చే నీరు తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. గాలి, నీరు, భూమి కలుషితం అవుతున్నాయి. ఫిబ్రవరి 21న యూసీఐఎల్‌ సీఎండీ బాధిత గ్రామాల్లో పర్యటించారు.

సీఎండీకి ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఇప్పటివరకూ జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించమని కోరారు. గ్రామాల్లో తాగునీరుకు పైప్‌లైన్‌ వేయించమని అడిగారు. నీరు ఇంకకుండా టెయిల్‌ పాండ్‌ను పునఃనిర్మించాలని కోరారు. గ్రామాల ప్రజల సమ్మతితో ఇళ్లు, పొలాలను యూసీఐఎల్‌ సేకరించాలని అడిగారు. ఈ మేరకు డిమాండ్లతో సీఎండీకి వినతి పత్రం సమర్పించాం.

ప్రజల డిమాండ్లపై రెండు వారాల్లోగా స్పందిస్తానన్న సీఎండీ ఇప్పటివరకూ స్పందించలేదని చెప్పారు. ఆయన సమాధానం కోసమే ధర్నా చేస్తున్నాం’ అని అవినాష్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు