చంద్రబాబు అండతోనే జేసీ రెచ్చిపోతున్నాడు

5 Mar, 2017 13:27 IST|Sakshi
చంద్రబాబు అండతోనే జేసీ రెచ్చిపోతున్నాడు

జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్
అనంతలో వైఎస్ఆర్ సీపీ నేతల ఆందోళన


అనంతపురం/విజయవాడ: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్దిచెబుతారని హెచ్చరించారు.

అనంతలో ఆందోళన: జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో దివాకర్ ట్రావెల్స్ వద్ద వైఎస్ఆర్ సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, పెద్దారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. జేసీ బ్రదర్స్ చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసునని.. వైఎస్ జగన్, విజయమ్మలను విమర్శించే అర్హత వారికి లేదని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు బుద్ధిచెబుతారని పార్టీ నేతలు శంకర్ నారాయణ, పెద్దారెడ్డి, గుర్నాధ్ రెడ్డి హెచ్చరించారు.

ఎమ్మెల్యేనా.. వీధి రౌడీనా?: జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేనా లేక వీధి రౌడీనా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన భాష చూసి ఎమ్మెల్యేలందరూ తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రిలో చూపించుకోవాలి కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని హితవు పలికారు. ప్రభాకర్ రెడ్డిని సోషల్ మీడియాలో అందరూ తిడుతున్నారని, ఆయన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థిస్తారా లేక చర్యలు తీసుకుంటారో తేల్చి చెప్పాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

చంద్రబాబు అండతోనే రెచ్చిపోతున్నాడు: జేసీ ప్రభాకర్ రెడ్డి భాష అత్యంత దారుణంగా ఉందని, చంద్రబాబు అండతోనే ఆయన రెచ్చిపోతున్నాడని వైఎస్ఆర్ సీపీ నేత జోగి రమేష్ అన్నారు. ఘోర బస్సు ప్రమాదం జరిగితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విమర్శించడం నేరమా అని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు కంట్రోల్‌లో పెట్టుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

బఫూన్‌లా మాట్లాడితే కోరలు పీకుతాం: జేసీ ప్రభాకర్ రెడ్డి బఫూన్‌లా మాట్లాడితే కోరలు పీకుతామని వైఎస్ఆర్ సీపీ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఆయన మరోసారి నోరు జారితే పల్నాడు నుంచి తాడిపత్రికి వెళ్లి బుద్ది  చెబుతామని అన్నారు.