చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు..

12 Apr, 2018 11:43 IST|Sakshi
పుత్తూరు రైల్వేస్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న నాయకులు

కొనసాగుతున్న ప్రత్యేకహోదా పోరాటం

పుత్తూరులో ప్రశాంతంగా  రైల్‌రోకో

చెన్నై, తిరుపతి రైలును  అడ్డుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు 

పుత్తూరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల నిరసన సెగ దేశ రాజధాని ఢిల్లీని తాకాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్‌ ఏలుమలై పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పుత్తూరు రైల్వేస్టేషన్‌లో రైల్‌రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే లక్ష్యంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేస్తుండడం గర్వకారణమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని తొలి నుంచి పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. 
నాలుగేళ్లు ప్యాకేజీ పాట పాడి..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం నాలుగేళ్లుగా ప్యాకేజీ పాట పాడి ఇప్పుడు హోదా కావాలని అడగడం విడ్డూరంగా ఉందని ఏలుమలై స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉన్న లోపాయికారి ఒప్పందం కారణంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణమన్నారు. అంతకుమునుపు స్థానిక బజారువీధిలోని శక్తిగణపతి ఆలయం నుంచి కార్యకర్తలతో కలిసి రైల్వేస్టేషన్‌ వద్దకు  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు ర్యాలీగా వచ్చారు. అనంతరం స్టేషన్‌ ఎదుట ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా చెన్నై నుంచి తిరుపతి వెళుతున్న మెమో ప్యాసింజర్‌ను అడ్డుకున్నారు. ఇంజిన్‌ వద్ద అడ్డంగా నిలబడి ప్రత్యేకహోదా ప్రకటించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ కొండయ్య, ఎస్‌ఐ హనుమంతప్ప, రైల్వే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీసీబీ డైరెక్టర్‌ దిలీప్‌రెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యులు సురేష్‌రాజు, నాయకులు రవిశేఖర్‌రాజు, ప్రతాప్, రెడ్డివారి భాస్కర్‌రెడ్డి, బాబూరావ్‌గౌడ్, వైఎస్సార్‌సీపీ మైనార్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎం మాహీన్, కంచి సుబ్రమణ్యం, నారాయణరెడ్డి, గోవిందస్వామిరెడ్డి, లారీమోహన్,గుణ, మురుగేష్, సంపత్, భాస్కరయ్య, గణేష్, రవి, జేసీబీ బాబు, బైపాస్‌రాజా, దొరస్వామిరెడ్డి, మురళిరాజు, తడుకు బాలాజీ, గూళూరు కరుణ పాల్గొన్నారు.

ప్రాణాలను పణంగా పెట్టిన ఎంపీలు..
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రత్యేకహోదా సాధించే క్రమంలో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ 5 మంది ఎంపీలు ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వైఎస్సార్‌సీపీ సత్యవేడు సమన్వయకర్త కోనేటి ఆదిమూలం అభిప్రాయపడ్డారు. బుధవారం పుత్తూరులో నిర్వహించిన రైల్‌రోకోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆగ్రహాన్ని ఢిల్లీకి తెలియజెప్పేందుకే రైల్‌రోకో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా