ప్రారంభమైన 'వంచన వ్యతిరేక దీక్ష'

30 Apr, 2018 08:59 IST|Sakshi
విశాఖ: ‘వంచన వ్యతిరేక దీక్ష’లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు

ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు దీక్షలు : వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి,  విశాఖపట్నం : ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు మోసాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని బీజేపీ దగా కోరు వైఖరికి నిరసనగా విశాఖపట్నం వేదికగా  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు  సోమవారం భారీ ఎత్తున ‘వంచన వ్యతిరేక దీక్ష’ చేపట్టారు. ఇందులో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యాకర్తలు పెద్ద ఎత్తున దీక్షా వేదిక వద్దకు తరలివచ్చారు. వంచన దీక్షను ప్రారంభిస్తూ దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలతో దీక్ష ప్రారంభమైనది. ఈ సందర్భంగా హోదా కోసం రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీలతో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా నల్లదుస్తుల్లో నిరసన దీక్షకు కూర్చున్నారు. 

ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వైఎస్సార్‌ సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతోపాటు రాష్ట్ర ప్రజలు నాలుగేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోకుండా మౌనంగా ఉంటూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం ‘ధర్మ పోరాటం’ అంటూ తిరుపతిలో దీక్షకు పూనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి తామంతా ముందుంటామని, కేంద్రం ఇచ్చిన ప్రతి హామీ అమలు కోసం తుదికంటా పోరాడతామని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబు దీక్షలకు పూనుకోవడం అధికారం కోసం వేస్తున్న ఎత్తుగడలే తప్ప మరొకటి కాదని వైఎస్సార్‌ సీపీ నేతలు ఎద్దేవా చేశారు.

హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, మిథున్‌రెడ్డి, అవినాష్‌ రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, భూమన కరుణాకర్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ దీక్షలో పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు