ఏడాదిలోగా వెలిగొండ నీరు

4 Jul, 2019 08:40 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి

మాది శంకుస్థాపనల పార్టీ కాదు.. ప్రాజెక్టుల సాధన పార్టీ

రామాయపట్నం మేజర్‌ పోర్టు కోసం కృషి

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, ఒంగోలు సిటీ: వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. ఏడాదిలో మొదటి సొరంగం పనులను పూర్తి చేసి రైతులకు పది టీఎంసీల నీటిని ఇవ్వడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రాజెక్టుల్లో వెలిగొండ ఉందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఒంగోలులోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను గల ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, దసరా, సంక్రాంతి పండుగ  పేర్లు చెప్పి ప్రజలను మోసగించిందని విమర్శించారు.

జిల్లా అభివృద్ధి విషయంలో తాను ఎప్పుడు పాలు పంచుకుంటానని అన్నారు. రామాయపట్నం ఓడరేవు మైనర్‌ పోర్టుకు చంద్రబాబు నాయుడు శంకుస్ధాపన చేశారని, ఐదేళ్లు కాలాన్ని వెళ్లబుచ్చి చివరి రోజుల్లో ప్రజల్ని మభ్యప్టెటడానికి శంకుస్థాపన  చేశారని అన్నారు. మాది శంకుస్ధాపనల పార్టీ కాదని ప్రాజెక్టులను సాధించే పార్టీగా వైవీ స్పష్టం చేశారు. ఐదేళ్లు చంద్రబాబు కృష్ణపట్నం పోర్టు నిర్వాహకుల ప్రాపకం కోసం పని చేసిన విషయం అందరికి తెలిసిందేనని అన్నారు. రామాయపట్నం మేజర్‌ పోర్టు కేంద్రం పరిధిలోనిది అన్నారు. కేంద్రం సహాయాన్ని తీసుకొని మేజర్‌ పోర్టు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధికలగనుందని తెలిపారు.రానున్న బడ్జెట్‌లో ఈ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారని పేర్కొన్నారు.

అవినీతిని సహించేది లేదు.. 
గత ప్రభుత్వం అవినీతిని అన్నింటా సంస్ధాగతం చేసిందని సుబ్బారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని పథకాల్లో అవినీతి, అక్రమాలను పెంచి పోషించారని అన్నారు. జగన్‌ ప్రభుత్వం అవినీతి రహిత పాలన ప్రజలకు అందించడానికి చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఏ పథకంలోనైనా అవినీతి. కాంట్రాక్టుల్లో కుంభకోణాలు నెలకున్నాయని అన్నారు. రూ.కోట్ల కొద్ది ప్రజాధనం లూఠీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి రహిత పాలన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా తిరుమల తిరుపతి దేవస్ధానం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

మరిన్ని వార్తలు