అగ్నిప్రమాదం 

10 Feb, 2018 17:07 IST|Sakshi
అగ్నిప్రమాదంలో కాలిపోతున్న ఇల్లు 

బూర్గంపాడు : మండల కేంద్రం బూర్గంపాడు ముదిరాజ్‌కాలనీలో గురువారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ముదిరాజ్‌ కాలనీలోని బొగ్గుల సత్యనారాయణ ఇంట్లో విద్యుదాఘాతంతో  మంటలు వ్యాపించాయి. దీంతో ఇళ్లంతా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కుటుంబసభ్యులు భయాందోళనలతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. దీంతో చుట్టుపక్కల వాళ్లు మేల్కొని పక్కన ఉన్న ఇళ్లపై నీళ్లు చల్లి మంటలు వ్యాపించకుండా నివారించగలిగారు. సమాచారం అందుకున్న ఎస్సై సంతోష్‌ తమ సిబ్బందితో కలసి సంఘటనా ప్రాంతానికి చేరుకుని అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. అగ్నిప్రమాద కేంద్రం సిబ్బంది అక్కడకు చేరుకునే సరికే సత్యనారాయణ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కట్టుబట్టలతో కుటుంబ సభ్యులు బయటపడ్డారు.  ఘటనా ప్రాంతాన్ని తహసీల్దార్‌ కేవీ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు బట్టా విజయ్‌గాంధీ, సర్పంచ్‌ పుట్టి కుమారి, ఎంపీటీసీ సభ్యులు జక్కం సర్వేశ్వరరావు ప్రమాద స్థలానికి వచ్చి పరిశీలించారు.  ప్రమాదంలో రూ.4 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ.8 వేల ఆర్థిక సాయం, 20 కిలోల బియ్యాన్ని తహసీల్దార్‌ అందజేశారు. ఆర్‌ఐ రాంబాబు, వీఆర్వో  వరలక్ష్మి అగ్నిప్రమాదంపై విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు