ఆటోమొబైల్ జోరు..

2 Jan, 2015 04:07 IST|Sakshi
ఆటోమొబైల్ జోరు..

డిసెంబర్‌లో పెరిగిన వాహన విక్రయాలు
సంస్కరణలు కావాలంటున్న కంపెనీలు

 
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు గత ఏడాది డిసెంబర్‌లో దుమ్ము దులిపాయి. ఎక్సైజ్ సుంకం రాయితీలు ముగియనుండడం, ఏడాది చివరలో నిల్వలు తగ్గించుకోవడానికి కంపెనీలు/డీలర్లు డిస్కౌంట్లు ఆఫర్ చేయడం, మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితుల తదితర అంశాల కారణంగా పలు కంపెనీల వాహన విక్రయాలు పెరిగాయి. దేశీయ అమ్మకాలతో పాటు మొత్తం అమ్మకాలు(దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి) కూడా పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టయోటా, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్ కంపెనీల విక్రయాలు పెరగ్గా, జనరల్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు తగ్గాయి.
 
బడ్జెట్‌పై ఆశలు
అధికంగా ఉన్న వడ్డీరేట్లు, బలహీనంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల వాహనాలకు డిమాండ్ తక్కువగానే ఉందని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ సుంకం రాయితీలను ఉపసంహరించడం వాహన పరిశ్రమపై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతుందని ఆయన అబిప్రాయపడ్డారు. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం భారీ స్థాయి నజరానాలు ప్రకటించకపోతే, వాహన పరిశ్రమ స్వల్పకాలంలో కోలుకునే సూచనలేమీ లేవని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాలో వాహన రంగం కీలకమైనదని, అందుకని ఈ రంగానికి సంబంధించి సంస్కరణలు రానున్న బడ్జెట్‌లో ఉండగలవన్న ఆశాభావాన్ని టయోటా కిర్లోస్కర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) ఎన్. రాజ వ్యక్తం చేశారు.

హ్యుందాయ్ రికార్డ్ అమ్మకాలు
గత ఏడాది వాహన పరిశ్రమకు గడ్డుకాలమని హ్యుందాయ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. అయినప్పటికీ, గత ఏడాది 4.11 లక్షల ప్రయాణికుల కార్లను విక్రయించామని, ఇది తమ కంపెనీ చరిత్రలో రికార్డని పేర్కొన్నారు. ప్రయాణికుల కార్ల విభాగంలో 22% మార్కెట్ వాటా సాధించామని వివరించారు. దేశీయ అమ్మకాలు 15%, ఎగుమతులు 30% చొప్పున పెరిగాయని పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ అమ్మకాలకు సంబంధించి వివిధ కంపెనీల విశేషాలు..
మారుతీ సుజుకీ దేశీయ విక్రయాలు 13%, ఎగుమతులు 3 రెట్లు చొప్పున పెరిగాయి.
మహీంద్రా దేశీయ అమ్మకాలు 7 శాతం తగ్గాయి. అయితే స్కార్పియో, ఎక్స్‌యూవీ 500, జైలో, బొలెరో, వెరిటో మోడళ్లతో కూడిన ప్రయాణికుల వాహన విభాగం విక్రయాలు 5 శాతం వృద్ధిని సాధించాయి. ఫోర్ వీల్ వాణిజ్య వాహనాల విక్రయాలు 15 శాతం, ఎగుమతులు 32% చొప్పున తగ్గాయి. ఈ ఏడాది కొత్త మోడళ్లను రంగంలోకి తెస్తామని, అమ్మకాలు పుంజుకుంటాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
టయోటా దేశీయ విక్రయాలు 10% పెరిగాయి.
మహీంద్రా ట్రాక్టర్స్ దేశీయ అమ్మకాలు 31% పడిపోయాయి. ఎగుమతులు 52% పెరిగాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ విక్రయాలు 48 శాతం, ఎగుమతులు 86 శాతం చొప్పున పెరిగాయి
టీవీఎస్ మోటార్ మొత్తం టూవీలర్ల దేశీయ విక్రయాలు 19% పెరిగాయి. స్కూటర్ల అమ్మకాలు 25 శాతం, బైక్‌ల అమ్మకాలు 22%, మొత్తం టూవీలర్ల అమ్మకాలు 19% చొప్పున పెరిగాయి.
2013లో 61,83,849గా ఉన్న హీరో వాహన విక్రయాలు 2014లో 66,45,787కు పెరిగాయి.

మరిన్ని వార్తలు