జీఎస్టీ : రెస్టారెంట్లు, వస్త్రాలపై పన్ను తగ్గింపు

7 Oct, 2017 03:57 IST|Sakshi

గ్రానైట్‌ పరిశ్రమపై పన్ను 28 శాతం నుంచి 18కి కుదింపు

రూ.50వేలపైబడి ఆభరణాల కోనుగోళ్లకు పాన్‌ కార్డు అవసరంలేదు

జీఎస్టీ కాంపొజిషన్‌ స్కీం పరిధి రూ. 1 కోటికి పెంపు

22వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్ణయాలను వెల్లడించిన అరుణ్‌ జైట్లీ

సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారులు, వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కొన్ని కీలక రంగాలు, వస్తువులపై పన్నుల శాతాన్ని తగ్గిస్తూ  జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా రెస్టారెంట్లపై 18 శాతంగా ఉన్న పన్నులు 12 శాతానికి, వస్త్రాలపై 12 శాతాన్ని 5 శాతానికి తగ్గించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ 22వ  సమావేశం నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మీడియాకు వెల్లడించారు. మరో రెండు నెలల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆందోళనలు చేస్తోన్న అక్కడి వస్త్రవ్యాపారులను శాంతింపజేసేందుకే వస్త్రాలపై జీఎస్టీ భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది.

జైట్లీ చెప్పిన విషయాల్లో ముఖ్యాంశాలు..
చిన్న పరిశ్రమలకు ఊరట : జీఎస్టీ కాంపోజిషన్‌ స్కీం పరిధిని రూ.75 లక్షల నుంచి రూ.1 కోటికి పెంచారు. ఈ నిర్ణయంతో చిన్నతరహా పరిశ్రమలకు లబ్ధిచేకూరనుంది.

ఎగుమతిదారులకు పన్ను మినహాయింపు : విదేశాలకు సరుకులు పంపే ఎగుమతిదారులను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎలాంటి పన్నులు ఉండవని, 2018, ఏప్రిల్‌ 1 నుంచి ఆ రంగంలో తప్పనిసరి ఈ-వాలెట్‌ విధానాన్ని అమలులోకి తేనున్నారు.

గ్రానైట్‌ పరిశ్రమకు ఊరట : తెలంగాణ సహా పలు రాష్ట్రాల డిమాండ్‌కు తలొగ్గిన జీఎస్టీ కౌన్సిల్‌.. గ్రానైట్‌ పరిశ్రమపై విధించిన పన్ను శాతాన్ని 28 నుంచి 18కి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

రెస్టారెంట్లు : 18 శాతం పన్ను పరిధిలో ఉన్న రెస్టారెంట్లను 12 శాతం శ్లాబ్‌లోకి చేర్చారు.

వస్త్రాలపై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

స్కూల్‌ స్టేషనరీ, రబ్బర్‌బ్యాండ్స్‌, మామిడిపండ్ల రసం, పాపడాలు తదితర వస్తువులపై అమలవుతోన్న పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి కుదించారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతోన్న ఆహార ప్యాకెట్లపై పన్ను 18 నుంచి 5 శాతానికి తగ్గింపు

ప్లాస్టిక్‌, రబ్బర్‌, పేపర్‌ వేస్ట్‌లపై 12గా ఉన్న ఉన్న పన్ను 5 శాతానికి కుదింపు

అన్‌బ్రాండెడ్‌ ఆయుర్వేద మందులు 18 నుంచి 5 శాతానికి

డీజిల్‌ ఇంజన్‌ విడిభాగాలపై పన్ను 28 నుంచి 18 శాతానికి తగ్గింపు

మరిన్ని వార్తలు