డిపాజిట్లకు ‘ఐదు లక్షల’ అభయం

2 Feb, 2020 01:00 IST|Sakshi

బ్యాంక్‌ డిపాజిట్లపై బీమా రూ.5 లక్షలకు పెంపు

ఇప్పటివరకూ ఇది లక్ష రూపాయలే

న్యూఢిల్లీ: సామాన్య బ్యాంకు డిపాజిటర్లకు భరోసాను కల్పించే తీపి కబురును నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.  డిపాజిట్లకు మరింత రక్షణ కల్పిస్తూ, వాటిపై బీమాను ఐదు రెట్లు– రూ. 5 లక్షలకు పెంచారు.  వివరాల్లోకి వెళితే...  బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌... ఎక్కువ మందికి సురక్షిత పెట్టుబడి సాధనం. ప్రస్తుతం డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) పరిధిలో ఒక్కో డిపాజిట్‌దారుడికి గరిష్టంగా రూ.లక్ష బీమా సౌలభ్యతను బ్యాంకులు అందిస్తున్నాయి. దీంతో ఏదైనా బ్యాంకు సంక్షోభం పాలై చెల్లింపుల్లో విఫలమైతే... అప్పుడు ఒక్కో డిపాజిట్‌ దారుడికి గరిష్టంగా రూ.లక్ష చొప్పున చెల్లిస్తారు. అయితే ఈ మొత్తాన్ని ఆర్థికమంత్రి ఐదు లక్షలకు పెంచారు.

ఇటీవలే మహారాష్ట్రకు చెందిన పీఎంసీ బ్యాంకు సంక్షోభం పాలవడంతో ఆ బ్యాంకుల్లో భారీగా డిపాజిట్‌ చేసుకున్న వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిపాజిటర్ల ఆగ్రహాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ముంబై వెళ్లిన సందర్భంగా స్వయంగా చవి చూశారు కూడా. ఆర్‌బీఐ సైతం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని బలంగా చాటాయి. దీంతో కేంద్ర సర్కారు ఈ అవసరాన్ని గుర్తించింది. దీనితో ఆర్థికశాఖ తాజా బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.

1993 తర్వాత...: చివరిగా 1993 మే1న డిపాజిట్లపై బీమాను సవరించారు. 1992లో జరిగిన సెక్యూరిటీస్‌ స్కామ్‌ దెబ్బకు బ్యాంక్‌ ఆఫ్‌ కరద్‌ మూతపడడం నాడు డిపాజిట్లపై గరిష్ట బీమాగా ఉన్న రూ.30,000 మొత్తాన్ని రూ.లక్షకు పెంచడానికి కారణమైంది. ఇటీవలి పీఎంసీ బ్యాంకు సంక్షోభం మరో విడత సవరణ అవసరాన్ని గుర్తు చేసింది. అయితే, డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచితే బ్యాంకులు చెల్లిస్తున్న ప్రీమియం కూడా పెరుగుతుంది.

డిపాజిట్‌ ఎంతున్నా బీమా ఐదు లక్షలకే..! 
బ్యాంకింగ్‌ అకౌంట్లు అందులోని మొత్తాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఐదు లక్షల డిపాజిట్‌ వరకే బీమా వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి వద్ద రూ.10 లక్షలు ఉన్నాయనుకుందాం. రెండు వేర్వేరు బ్యాంకుల్లో రూ.ఐదు లక్షల చొప్పున డిపాజిట్‌ చేస్తే, మొత్తం రూ.10 లక్షలకూ బీమా వర్తించదు. పాన్‌ నెంబర్‌సహా తాజా బ్యాంకింగ్‌ సేవల సాంకేతికత వల్ల ఒక వ్యక్తికి బ్యాంకింగ్‌ వ్యవస్థలో డిపాజిట్‌ మొత్తం ఎంతుందన్న విషయంలో తేలిగ్గా వెల్లడవుతుంది. అందువల్ల బ్యాంకుల్లో డిపాజిట్‌ పరిమాణం ఎంతయినా, కేవలం రూ. 5 లక్షలకే బీమా వర్తిస్తుందన్న విషయం గమనార్హం.

సేవల వ్యయం పెరుగుతుంది
తాజా నిర్ణయం వల్ల బ్యాంకింగ్‌ సేవల వ్యయం పెరుగుతుంది. ప్రీమియం ఐదు రెట్లు పెరగడం వల్ల బ్యాంకులపై వ్యయ భారం తీవ్రంగానే ఉంటుంది. ఇది కస్టమర్లకు బదలాయించే అవకాశాలే ఉన్నాయి.
– అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌

మరిన్ని వార్తలు