ఎగిరితే కిందకు దిగాల్సిందే!!

20 Aug, 2016 00:36 IST|Sakshi
ఎగిరితే కిందకు దిగాల్సిందే!!

పోటాపోటీగా ఆఫర్లిచ్చిన విమాన సంస్థలు
ఫలితంగా భారీగా తగ్గిన ఆదాయాలు

 న్యూఢిల్లీ: విమానయాన మార్కెట్లో సాధ్యమైనంత వాటాను చేజిక్కించుకోవాలని.. ప్రయాణికుల భర్తీ రేటును పెంచుకోవాలని విమానయాన సంస్థలు పోటాపోటీగా ధరల తగ్గింపు ఆఫర్లిచ్చిన ఫలితం వాటి ఆదాయాలపై కనిపిస్తోంది.

ఎయిరిండియా ఆదాయాల్లో 14% తగ్గుదల
జూన్ త్రైమాసికంలో గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు ఎయిర్ ఇండియా దేశీయ కార్యకలాపాల ఆదాయం 14 నుంచి 16% మేర తగ్గింది. ఇదే కాలంలో కంపెనీ టికెట్ ధరలను 22%తగ్గించడం గమనార్హం. ఇక 2015  జూన్ త్రైమాసికంలో రాస్క్ రూ.5.83గా ఉండగా... ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అది రూ.4.99కు పడిపోయింది. గత 4 నెలల కాలంలో టికెట్ల ధరలు తగ్గగా... అదే సమయంలో విమానయాన ఇంధన చార్జీలు, విమానాశ్రయ చార్జీల్లో పెరుగుదల కారణంగా వ్యయాలు పెరిగిపోయినట్టు ఎయిర్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు.

ఇండిగో పరిస్థితీ అంతే...
మార్కెట్ వాటా పరంగా అతిపెద్ద కంపెనీ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. జూన్ త్రైమాసికంలో రాస్క్ 12.7 శాతం తగ్గి రూ.4.15 నుంచి రూ.3.62కు క్షీణించింది. ఇంధన ధరలు పెరగడం, విమానాల అద్దె రుసుములు సైతం పెరిగిపోవడంతో కంపెనీ ఆదాయాలు జూన్ త్రైమాసికంలో 7.46 శాతం క్షీణించి రూ.591 కోట్లకు పరిమితం అయ్యాయి. ధరల పోటీ కారణంగా లాభం తగ్గినట్టు ఫలితాల సందర్భంగా ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్యఘోష్ తెలియజేశారు

 జెట్ ఎయిర్‌వేస్ క్షీణత 4.25 శాతం
జెట్ ఎయిర్‌వేస్ దేశీయ ఆదాయాలు జూన్ త్రైమాసికంలో 4.25 శాతం క్షీణించి రూ.2,104 కోట్లకు పరిమితం అయ్యాయి. రాస్క్ సైతం రూ.4.47 నుంచి రూ.4.22కు తగ్గిపోయింది.

12 శాతం వరకు దిగొచ్చిన చార్జీలు
వేసవి సీజన్‌లో స్పైస్‌జెట్, గో ఎయిర్ ప్రారంభించిన ధరల యుద్ధంలోకి ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా వచ్చి చేరాయి. పోటీ ఫలితంగా సగటున విమానయాన చార్జీలు 10 నుంచి 12 శాతం వరకు తగ్గాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు