భారత్‌లోకి అలీబాబా ఎంట్రీ

6 Feb, 2015 00:39 IST|Sakshi
భారత్‌లోకి అలీబాబా ఎంట్రీ

పేటీఎంలో 25 శాతం వాటా కొనుగోలు...
* వన్97 సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం..
 
*  డీల్ విలువ రూ. 3,000 కోట్ల పైనే!
 న్యూఢిల్లీ: ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం, చైనాకు చెందిన అలీబాబా... భారత్‌లో శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ షాపింగ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. మొబైల్ కామర్స్, చెల్లింపుల సేవల సంస్థ పేటీఎంను ఇందుకు వేదికగా ఎంచుకుంది. పేటీఎం మాతృ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌లో 25 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.

దీనికి సంబంధించి వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు అలీబాబా గ్రూప్‌లో భాగమైన యాంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో మొబైల్ పేమెంట్, మొబైల్ కామర్స్ విభాగంలో వృద్ధికి ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని తెలిపింది. కాగా, ఈ డీల్ విలువ ఎంతనేది ఇరు సంస్థలూ వెల్లడించనప్పటికీ.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 50 కోట్ల డాలర్లకుపైగా (రూ.3,000 కోట్ల పైమాటే) ఉండొచ్చని అంచనా. దీనిప్రకారం చూస్తే వన్97 కంపెనీ విలువ(వేల్యుయేషన్) రూ. 12,000 కోట్లుగా లెక్కతేలుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో అలీబాబా అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్(నాస్‌డాక్)లో లిస్టింగ్ ద్వారా 25 బిలియన్ డాలర్లను సమీకరించడం తెలిసిందే. తద్వారా ప్రపంచంలో అతిపెద్ద ఐపీఓగా కూడా కొత్త రికార్డు సృష్టించింది.
 
భారత్‌లో తొలి పెట్టుబడి...
భారతీయ కంపెనీల్లో ఇదే తమ తొలి పెట్టుబడి అని యాంట్ ఫైనాన్షియల్ వెల్లడించింది. ఈ నిధులను పేటీఎం.. తమ మొబైల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తరించేందుకు, ఎం-కామర్స్ కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఉపయోగించనుందని వివరించింది. పే టీఎం బిజినెస్‌కు అవసరమైన వ్యూహాత్మక, సాంకేతికపరమైన తోడ్పాటుకు కూడా అందించనున్నట్లు యాంట్ ఫైనాన్షియల్ వైస్ ప్రెసిడెంట్ సైరిల్ హన్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘100 కోట్లకుపైగా జనాభా కలిగిన భారత్‌లోని మొబైల్ పేమెంట్ మార్కెట్లో అపార అవకాశాలున్నాయి. ఇక్కడ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అంతకంతకూ పెరుగుతున్నారు. ఎం-కామర్స్, పేమెంట్స్‌కు ఇది అత్యంత సానుకూలాంశం.

అందుకే ఈ రంగంలో అత్యుత్తమ సంస్థగా నిలుస్తున్న పే టీఎంను వ్యూహాత్మక పెట్టుబడి కోసం ఎంచుకున్నాం’ అని హన్ వివరించారు. యాంట్, పే టీఎంల భాగస్వామ్యంతో మొబైల్ వాలెట్ విభాగంలో భారతీయ కస్టమర్లకు మరింత అత్యుత్తమ సేవలను అందించేందుకు దోహదం చేయనుందని,  కస్టమర్లను గణనీయంగా పెంచుకునేందుకు వీలవుతుందని వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు. ఈ డీల్‌కు సిటీ, గోల్డ్‌మన్ శాక్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా వ్యవహరించాయి.
 
పేటీఎం సంగతిదీ:
మొబైల్ ఫోన్ కస్టమర్లకు విలువ ఆధారిత సేవలు అందించే సంస్థగా వన్97 కమ్యూనికేషన్స్ ప్రస్థానం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దీని ప్రధాన బ్రాండ్ పేటీఎం. 2009లో ఈ పోర్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిం ది. దీని ద్వారా తొలుత ఆన్‌లైన్‌లో రీచార్జ్ సేవలను మొదలుపెట్టింది. ఈ విభాగంలో పే టీఎం భారత్‌లో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం మొబైల్ కామర్స్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలకు మొబైల్ ద్వారా చెల్లింపుల ప్రొవైడర్‌గా వ్యవహరిస్తోంది. వన్97లో ఇప్పటికే సెయిఫ్ పార్ట్‌నర్స్, సఫైర్ వెంచర్స్, సామా క్యాపిటల్, ఇంటెల్ క్యాపిటల్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. 1,000 మందికిపైగా ఉద్యోగులు వన్97లో పనిచేస్తున్నారు.
 
కాగా, గతేడాది అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా భారత్‌కు వచ్చిన సందర్భంగా ఇక్కడి టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్స్‌కు తోడ్పాటునందిస్తామని.. భారతీయ కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పే టీఎం రూపంలో ఇది సాకారమైంది. 2014 అక్టోబర్‌లో అలీబాబా గ్రూప్ ఏర్పాటు చేసిన యాంట్ ఫైనాన్షియల్స్... చైనాలో అతిపెద్ద మొబైల్ పేమెంట్ సేవల సంస్థ ‘అలీ పే వాలెట్’ను నిర్వహిస్తోంది. దీనికి 19 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు అంచనా. చిన్న స్థాయి సంస్థల(ఎస్‌ఎంఈ)పై కూడా ఎక్కువగా దృష్టిపెడుతోంది.

>
మరిన్ని వార్తలు