‘హెచ్‌1’ దెబ్బ అమెరికాకే..!

21 Jun, 2019 05:24 IST|Sakshi

వీసాలపై ఆంక్షలతో అక్కడి సంస్థలకు నిపుణులు దొరకరు

భారత ఐటీ పరిశ్రమకూ ఇబ్బందే నాస్కామ్‌ వ్యాఖ్యలు  

న్యూఢిల్లీ: టెక్నాలజీ నిపుణులకు వీసాలివ్వటంపై మరిన్ని పరిమితులు విధిస్తే అమెరికన్‌ కంపెనీలకే ప్రతికూలమవుతుందని దేశీ ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్‌ వ్యాఖ్యానించింది. ఈ వీసాలపై విదేశీ నిపుణులను నియమించుకునే అమెరికన్‌ కంపెనీలు సరైన వారు దొరక్క బలహీనంగా మారతాయని, ఉద్యోగాలకు ముప్పు తప్పదని పేర్కొంది. వివాదాస్పద హెచ్‌–1బీ వీసాలు అత్యధికంగా భారతీయులకే దక్కుతుండటం వారి ప్రతిభకు తార్కాణమని, వీటిలో చాలా మటుకు వీసాలను అంతర్జాతీయ, అమెరికన్‌ బహుళజాతి దిగ్గజాలు స్పాన్సర్‌ చేస్తున్నాయని నాస్కామ్‌ తెలియజేసింది. విదేశీ కంపెనీలు డేటాను తమ దేశంలోనే భద్రపర్చాలంటూ ఒత్తిడి చేసే దేశాలకు ఇచ్చే హెచ్‌–1బీ వీసాలపై 10–15 శాతం మేర పరిమితి విధించే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోందంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో నాస్కామ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఈ అంశంపై ఇప్పటిదాకా అమెరికా ప్రభుత్వం నుంచి అధికారికంగా ధృవీకరణ ఏదీ రాలేదని, అధికారులిచ్చే స్పష్టమైన వివరణ కోసం ఎదురు చూస్తున్నామని నాస్కామ్‌ తెలిపింది. ఒకవేళ ఇలాంటిదేమైనా అమలు చేసిన పక్షంలో ప్రధానంగా ఉత్తర అమెరికా మార్కెట్‌ నుంచే భారీగా ఆదాయాలు పొందుతున్న 150 బిలియన్‌ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడనుంది. సాధారణంగా భారతీయ ఐటీ సంస్థలు అత్యధికంగా హెచ్‌–1బీ వీసాలపైనే తమ ఉద్యోగులను అమెరికాలోని క్లయింట్‌ లొకేషన్స్‌కు పంపిస్తుంటాయి.

అయితే, ఇటీవలి కాలంలో వీసాల పరిశీలన చాలా కఠినతరంగా మారడంతో దేశీ ఐటీ సంస్థలు అమెరికాలోని స్థానికులనే ఎక్కువగా రిక్రూట్‌ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ‘ఒకవేళ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకోవడాన్ని అమెరికా విధానాలు కఠినతరం చేసిన పక్షంలో దాని వల్ల.. వారిపై ఆధారపడి ఉన్న అమెరికా కంపెనీలే బలహీనపడతాయి. ఆయా సర్వీసులను మళ్లీ విదేశాల నుంచి పొందాల్సి వస్తుంది’ అని నాస్కామ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  

పరిమితులపై ఇంకా సమాచారం రాలేదు: కేంద్ర వాణిజ్య శాఖ
డేటా లోకలైజేషన్‌ నిబంధనలు అమలు చేసే దేశాలకిచ్చే హెచ్‌–1బీ వీసాలపై పరిమితులు విధించే విషయంపై అమెరికా నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. చెల్లింపుల సేవలు అందించే పేమెంట్‌ సర్వీసుల సంస్థలు భారతీయ వినియోగదారుల డేటాను భారత్‌లోనే ఉంచాలంటూ కేంద్రం గతేడాది ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి నిబంధనలనే వ్యతిరేకిస్తూ.. తాజాగా హెచ్‌–1బీ వీసాల విషయంలో భారత్‌ లాంటి దేశాలను అమెరికా టార్గెట్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు