మినిమమ్‌ బ్యాలెన్స్‌ పై ఎస్బీఐ గుడ్ న్యూస్

15 Apr, 2017 10:48 IST|Sakshi
మినిమమ్‌ బ్యాలెన్స్‌ పై ఎస్బీఐ గుడ్ న్యూస్
ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలని.. లేకపోతే ఛార్జీల మోత మోగిస్తామని ఎస్బీఐ అంతకమునుపు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ ఛార్జీల బాదుడు ప్రక్రియను కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే  ఏ బ్యాంకు అకౌంట్లకు ఎంత ఛార్జీవేస్తారో? మా అకౌంట్ల పరిస్థితేమిటి? అని ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనలపై ఈ ప్రభుత్వ రంగ దిగ్గజం స్పందించింది. కొన్ని అకౌంట్ల కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు పేర్కొంది. స్మాల్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, జన్ ధన్ అకౌంట్లు లేదా ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ స్కీమ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద అకౌంట్లు ప్రారంభించిన వారికి మినిమమ్ బ్యాలెన్స్  ఉంచాల్సిన పరిమితి నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది.
 
అంతేకాక, కార్పొరేట్ శాలరీ అకౌంట్లకు కూడా మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్  నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు తెలిపింది.   ఈ విషయాన్ని ఎస్బీఐ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఐదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకులను ఎస్బీఐ ఇటీవలే తనలో విలీనం చేసుకుంది. బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే ఛార్జీలు వేస్తామని తెలిపింది. ఈ ప్రభావం పెన్షనర్లు, విద్యార్థులతో కలుపుకుని మొత్తం 31 కోట్ల మంది డిపాజిట్ దారులపై ప్రభావం చూపనుందని తెలిసింది. 
 
మరిన్ని వార్తలు