17 శాతం తగ్గిన భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ లాభం

31 Oct, 2017 01:31 IST|Sakshi

క్యూ2లో రూ.638 కోట్లు  

న్యూఢిల్లీ: టెలికం మార్కెట్లో ప్రతికూల పవనాల ప్రభావం భారతీ ఇన్‌ఫ్రాటెల్‌పై కూడా ప్రభావం చూపించినట్టున్నాయి. కంపెనీ నికర లాభం 17.57 శాతం తగ్గిపోయి రూ.638 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.774 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,292 ఓట్లతో పోలిస్తే 11 శాతం వృద్ధితో రూ.3,648 కోట్లకు పెరిగింది.

దీనిపై భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ చైర్మన్‌ అఖిల్‌ గుప్తా మాట్లాడుతూ... భారతీ ఇన్‌ఫ్రాటెల్‌తోపాటు, ఇండస్‌ టవర్స్‌ (ఇందులో 42 శాతం వాటా భారతీ ఇన్‌ఫ్రాటెల్‌కు ఉంది) తగినంత మార్కెట్‌ వాటాను సొంతం చేసుకోగల స్థితిలో ఉన్నాయని, వాటాదారులకు స్థిరమైన విలువను అందించే సత్తా ఉందని చెప్పారు. దేశీ టెలికం పరిశ్రమ డేటా ఆధారిత నమూనాను స్వీకరించిందని, డిజిటల్‌ టెక్నాలజీకి నిదర్శనంగా మారుతోందని ఆయన చెప్పారు.

ఆపరేటర్లు 4జీ నెట్‌వర్క్‌కు మారిపోతుండటం, దేశంలో 5జీ టెక్నాలజీ రానుండటం వంటి పరిణామాలను ఆయన ఉదహరించారు. ఆపరేటర్లు మరిన్ని పెట్టుబడులతో డిజిటల్‌ సదుపాయాలను పటిష్టం చేసుకునే ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ స్మార్ట్‌ సిటీల కార్యక్రమం అదనపు అవకాశాలను తెస్తుందన్నారు. ఇవన్నీ పరిశ్రమకు మేలు చేసే పరిణామాలుగా వివరించారు. మరోవైపు సోమవారం జరిగిన భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ బోర్డు సమావేశంలో ఇండస్‌ టవర్స్‌ను అనుబంధ కంపెనీగా మార్చుకునే లక్ష్యంతో ఆ కంపెనీలో మరింత వాటాను సొంతం చేసుకునే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు