ఎయిర్‌హోస్టెస్‌ కోసం హైజాక్‌ ప్లాన్‌

31 Oct, 2017 01:34 IST|Sakshi

జెట్‌ ఎయిర్‌వేస్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు దుండగుడి ఎత్తుగడ

ఆ తర్వాత ఆమె ఉద్యోగం కోసం తనను ఆశ్రయిస్తుందని వ్యూహం

అహ్మదాబాద్‌: జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఓ ఎయిర్‌హోస్టెస్‌కు దగ్గరయ్యేందుకు ఏకంగా హైజాక్‌ కుట్రపన్నాడో ప్రబుద్ధుడు. జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రతిష్టను దెబ్బతీసి ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగం పోగొడితే ఆమె కొలువు కోసం తన వద్దకు వస్తుందని వింత వ్యూహం పన్నాడు. అందుకోసం విమానంలో బాంబులు, హైజాకర్లు ఉన్నారంటూ వాష్‌రూమ్‌లో ఓ కాగితం ముక్క ఉంచి అందరినీ హడలెత్తించాడు. గుజరాతీ సంపన్న కుటుంబానికి చెందిన బిర్జూ కిశోర్‌ సల్లా ముంబైలో నివసిస్తూ వజ్రాభరణాల వ్యాపారం చేస్తుంటాడు.

జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాల్లో తరచుగా ప్రయాణించే అతను ఓ ఎయిర్‌హోస్టెస్‌ను చూసి ఇష్టపడ్డాడు. ఆమెను ఎలాగైనా తన వద్దకు రప్పించుకోవాలనీ, అందుకోసం ఆమె ఉద్యోగం పోగొట్టాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం గతంలో విమానంలోకి బొద్దింకను తీసుకొచ్చి, తనకు వడ్డించిన భోజనంలో అతనే బొద్దింకను వేసుకుని జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బందితో తీవ్రంగా గొడవపడ్డాడు. తాజాగా సోమవారం ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న 9డబ్ల్యూ 339 నంబరుగల విమానమెక్కాడు.

విమానం 115 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో తెల్లవారుజామున 2.55 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అనంతరం వాష్‌రూమ్‌కు వెళ్లిన సల్లా ‘ప్లేన్‌లో 12 మంది హైజాకర్లు, బాంబులు ఉన్నాయి. ఢిల్లీకి కాకుండా నేరుగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు విమానాన్ని తీసుకెళ్లాలి. ఇంకెక్కడైనా ల్యాండింగ్‌కు యత్నిస్తే విమానం పేలిపోతుంది’ అని ఉర్దూలో, ఇంగ్లిష్‌లో రాసిన ఓ బెదిరింపు కాగితం ముక్కను అక్కడ ఉంచాడు.

దానిని చూసిన సిబ్బంది వెంటనే పైలట్‌కు సమాచారం అందించడంతో హైజాక్‌ అలర్ట్‌ బటన్‌ నొక్కి అత్యవసరంగా అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో 3.45 గంటలకు దించివేశారు. అనంతరం పోలీసులు ప్రయాణికులను కిందకు దింపి, విమానం మొత్తాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసి ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు విమానం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. కిశోర్‌ సల్లాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

అతను ఇకపై విమానాల్లో ఎక్కేందుకు అనుమతించకుండా నిషేధం విధించాలని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు ఆదేశించారు. ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ చేపట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గుజరాత్‌ పోలీసులు హైజాక్‌ వ్యతిరేక చట్టం కింద కేసును నమోదు చేస్తే తాము విచారణ చేపడతామని ఎన్‌ఐఏ చీఫ్‌ వైసీ మోదీ చెప్పారు.

మరిన్ని వార్తలు