స్టాక్ మార్కెట్‌కు భెల్ షాక్

8 Aug, 2015 01:02 IST|Sakshi
స్టాక్ మార్కెట్‌కు భెల్ షాక్

బ్యాంక్, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ
♦ ఆయిల్ షేర్లకు లాభాలు
♦ 62 పాయింట్ల క్షీణతతో 28,236కు సెన్సెక్స్
♦ 24 పాయింట్లు నష్టంతో 8,565కు నిఫ్టీ
 
 ముంబై : బ్యాంకింగ్, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ప్రభుత్వ రంగ సంస్థ భెల్ నికర లాభం భారీగా క్షీణించడంతో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ బలహీనంగా సాగింది. ఆద్యంతం ఊగిసలాటకు గురైన ట్రేడింగ్‌లో  బీఎస్‌ఈ సెన్సెక్స్ 62 పాయింట్లు క్షీణించి 28,236 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు క్షీణించి 8,565 పాయింట్ల వద్ద ముగిశాయి. విద్యుత్తు, బ్యాంక్, లోహ, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై తీసుకునే నిర్ణయానికి ఈ గణాంకాలు కీలకం కానుండటంతో ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను తగ్గించుకున్నారని నిపుణులంటున్నారు.  భెల్ నికర లాభం 82 శాతం క్షీణించడం స్టాక్‌మార్కెట్‌పై బాగానే ప్రభావం చూపించింది. అర్థిక ఫలితాలు అధ్వానంగా ఉండటంతో బీఎస్‌ఈలో ఈ షేర్ 6 శాతం క్షీనించి రూ.266 వద్ద ముగిసింది.  సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా పతనమైన షేర్ ఇదే. కాగా 142 పాయింట్ల శ్రేణిలో సెన్సెక్స్ కదలాడింది.

 లాభాల్లో ఆయిల్ షేర్లు...:అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు-హెచ్‌పీసీఎల్ 7 శాతం, బీపీసీఎల్, ఐఓసీలు చెరో 2 శాతం, ఓఎన్‌జీసీ 4 శాతం చొప్పున పెరిగాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి.  భెల్ 5.8 శాతం, కోల్ ఇండియా 3.6 శాతం, ఎస్‌బీఐ 2.3 శాతం, బజాజ్ ఆటో 1.4 శాతం, ఎన్‌టీపీసీ 1.3 శాతం, సిప్లా 0.9 శాతం, టీసీఎస్ 0.8 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.7 శాతం చొప్పున తగ్గాయి. ఇక పెరిగిన షేర్ల విషయానికొస్తే ఓఎన్‌జీసీ 4.4 శాతం, టాటా మోటార్స్ 2.5 శాతం, వేదాంత 2 శాతం చొప్పున పెరిగాయి. 1,542 షేర్లు నష్టాల్లో, 1,380 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,444 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.17,509 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,33,059 కోట్లుగా నమోదైంది  ఆసియా మార్కెట్లు లాభాల్లో, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

 అమెరికా మార్కెట్లు నష్టాల్లో...
 అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లోనే వడ్డీరేట్లను పెంచే విధంగా అమెరికా ఉద్యోగ గణాంకాలు వెలువడడంతో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
 
 నేటి బోర్డు సమావేశాలు...
  దివీస్ ల్యాబ్, సెంట్రల్ బ్యాంక్, డీబీ రియల్టీ, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, జై ప్రకాశ్ అసోసియేట్స్, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్, మల్టీ కమోడిటీ  ఎక్స్ఛేంజ్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, వా టెక వాబాగ్, బీఎఫ్ యుటిలిటీస్, ధమ్‌పూర్ షుగర్స్,  అంబికా కాటన్, ఆటోలైన్ ఇండస్ట్రీస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, కామత్ హోటల్స్, తపారియా టూల్స్

>
మరిన్ని వార్తలు