కోవిడ్‌-19కు ఔషధం- బయోకాన్‌ జూమ్‌

14 Jul, 2020 13:26 IST|Sakshi

ఇక మార్కెట్లోకి ఇంజక్షన్‌ 

సైటోకైన్‌ సమస్యల నివారణకు

ఒక్కో వయల్‌ ధర రూ. 8,000

5 శాతం జంప్‌చేసిన షేరు

కోవిడ్‌-19 సోకినవారి చికిత్సకు వినియోగించగల ఔషధానికి దేశీ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నుంచి అనుమతి లభించినట్లు ఫార్మా దిగ్గజం బయోకాన్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. ఈ ఔషధాన్ని కరోనా వైరస్‌ సోకిన రోగుల చికిత్సలో వినియోగించవచ్చని తెలియజేసింది. ఒక్కో ఇంజక్షన్‌ ఖరీదు రూ. 8,000కాగా.. ఇకపై వీటిని దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌ సోకడంతో స్వల్పంగా లేదా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు వీటిని వినియోగించవచ్చని వివరించింది.  

25 ఎంజీ డోసేజీలో
కోవిడ్‌-19 కారణంగా ఓమాదిరి లేదా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న రోగుల చికిత్సకు వినియోగించగల ఐటోలిజుమాబ్‌ ఔషధాన్నిమార్కెట్లో ప్రవేశ పెట్టనున్నట్లు బయోకాన్‌ తాజాగా పేర్కొంది. ఐటోలిజుమాబ్‌ ఇంజక్షన్‌ను 25 ఎంజీ/5ఎంఎల్‌ డోసేజీలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో బయోకాన్‌ షేరుకి డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతంఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 431 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 435ను సైతం అధిగమించింది. 

పరీక్షల తదుపరి
అత్యవసర ప్రాతిపదికన సైటోకైన్‌ విడుదల సమస్య(ఏఆర్‌డీఎస్‌)లో చికిత్సకోసం దేశీయంగా  ఐటోలిజుమాబ్‌ ఔషధాన్ని వినియోగించేందుకు డీసీజీఐ అనుమతి పొందినట్లు బయోకాన్‌ తెలియజేసింది. బెంగళూరులోని బయోకాన్‌ పార్క్‌లో గల ప్లాంటులో ఐటోలిజుమాబ్‌ సొల్యూషన్‌ను తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ముంబై, న్యూఢిల్లీలోని పలు ఆసుపత్రులలో ఈ ఔషధ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. ఏఆర్‌డీఎస్‌ పేషంట్లలో సీఆర్‌ఎస్‌ను నియంత్రించడంలో ఈ ఔషధం ఫలితాలు సాధించినట్లు వివరించింది. తద్వారా సైటోకైన్‌ సమస్య ద్వారా సవాళ్లు ఎదుర్కొంటున్న పేషంట్లకు ఈ ఔషధ వినియోగానికి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు తెలియజేసింది. అత్యధిక శాతం పేషంట్లకు నాలుగు డోసేజీలు అవసరమవుతాయని బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ పేర్కొన్నారు. ఈ నాలుగు ఇంట్రావీనస్‌ ఇంజక్షన్ల విలువ రూ. 32,000గా తెలియజేశారు. దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా