కలుపుకునే ‘కింగ్‌’లు ఇవే

15 Jun, 2017 00:57 IST|Sakshi
కలుపుకునే ‘కింగ్‌’లు ఇవే

పీఎన్‌బీ, బీవోబీ, బీవోఐ, కెనరా బ్యాంకులు
ఇతర బ్యాంకులను విలీనం చేసుకునేందుకే ఎంపిక
ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పణ


న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీలు) భారీ స్థాయిలో విలీనాలు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వరంగంలో 21 బ్యాంకులు ఉండగా, విలీనాలతో ఓ నాలుగైదు పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో బలంగా ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ), బ్యాంకు ఆఫ్‌ బరోడా (బీవోబీ), బ్యాంకు ఆఫ్‌ ఇండియా (బీవోఐ), కెనరా బ్యాంకులను ఎంపిక చేసినట్టు ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. ప్రభుత్వరంగంలోని చిన్న బ్యాంకులను విలీనం చేసుకునే సామర్థ్యం వీటికుందని ప్రభుత్వం భావిస్తోంది.

అందుకే చిన్న బ్యాంకులను విలీనం చేసుకునేందుకు గల అవకాశాలను అన్వేషించాలంటూ ఈ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరినట్టు ఆ అధికారి వెల్లడించారు. విలీనానికి తమ వైపు నుంచి ఉన్న సానుకూలతలు, ప్రతికూలతలపై ఈ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సమర్పించాయి. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఇందుకు ఎటువంటి కాల పరిమితి లేదని ఆ అధికారి స్పష్టం చేశారు. ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కలసిపోయిన విషయం విదితమే. భవిష్యత్తులో మరిన్ని విలీనాలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇప్పటికే తెలిపారు.

విలీనం ఫలితమిచ్చేనా...?
విలీనం చేసుకునేట్టు అయితే ఒకే ప్రాంతంలో శాఖలు పెరిగిపోవడం, సాంకేతిక అనుసంధానత, పోటీ వ్యతిరేక అంశాలు ఏవైనా తలెత్తుతాయా? తదితర వివరాలను ఆర్థిక శాఖ కోరింది. విలీనం అనంతరం ప్రతికూలత ఫలితాలు ఎదురవ్వకుండా చూడడమే దీని ఉద్దేశం. అయితే, ఈ విలీనాలు  పీఎస్‌బీల బలోపేతానికి తోడ్పడతాయన్న విషయంలో విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విలీనం వెనుకనున్న ఉద్దేశమేంటని రేటింగ్‌ సంస్థ ఇక్రా గ్రూప్‌ హెడ్‌ కార్తీక్‌ శ్రీనివాసన్‌ సందేహం వ్యక్తం చేశారు. బలహీనంగా ఉన్న రెండు బ్యాంకుల విలీనంతో ఒక బలమైన బ్యాంకు ఏర్పడదన్నది ఆయన అభిప్రాయం.

అలాగే, ఒక బలమైన బ్యాంకు, ఒక బలహీన బ్యాంకును విలీనం చేసినా పటిష్ట బ్యాంకు ఏర్పాటు అసాధ్యమన్నారు. విలీనం చేసుకున్న బ్యాంకు బలిపశువుగా మారే ప్రమాదమూ లేకపోలేదన్నారు. ఎస్‌బీఐ ఇందుకు ఉదాహరణ అని... ఆరు బ్యాంకుల విలీనం తర్వాత ఎస్‌బీఐ రూ.3,000 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిందని, అదే విడిగా ఎస్‌బీఐ బ్యాంకు ఫలితాలను చూసుకుంటే రూ.2,815 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు ఆయన వివరించారు.

సిండికేట్, విజయా, కెనరా విలీనం!
విలీనానికి ఎంపిక చేసే సంస్థలు చిన్నవైనప్పటికీ ఆర్థికంగా స్థిరమైనవే అయి ఉండాలన్నది ఆర్థిక శాఖ ప్రతిపాదన. బెంగళూరు ప్రధాన కార్యాలయం గల కెనరా బ్యాంకు, విజయా బ్యాంకుతోపాటు సిండికేట్‌ బ్యాంకు (ప్రధాన కార్యాలయం మణిపాల్, కర్ణాటక)లు ఇప్పటికే విలీనంపై చర్చలు ప్రారంభించాయని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అలాగే కోల్‌కతా ప్రధాన కేంద్రంగా గల అలహాబాద్‌ బ్యాంకు, యూకో బ్యాంకు సైతం ఒక్కటిగా ఏర్పడవచ్చని చెప్పారు. మొండిబకాయిల సమస్య విలీనాలకు ఆటంకం కాబోదన్నారు.

ఆర్‌బీఐ ఆంక్షల పరిధిలోకి సెంట్రల్‌ బ్యాంక్‌
భారీగా ఎన్‌పీఏల సమస్యను, ఆస్తులపై ప్రతికూల రాబడులను ఎదుర్కొంటున్న సెంట్రల్‌ బ్యాంకు కూడా ఆర్‌బీఐ దిద్దుబాటు కార్యాచరణ పరిధిలోకి వచ్చింది. ఈ విషయాన్ని బ్యాంకు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు తెలియజేసింది. ఇప్పటికే ఐడీబీఐ, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, యూకో బ్యాంకు, దేనా బ్యాంకులు సైతం ఆర్‌బీఐ ఆంక్షల పరిధిలో ఉన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు