రూ.3,300 కోట్ల హవాలా రాకెట్‌ వెలుగులోకి..!

12 Nov, 2019 14:24 IST|Sakshi

ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీల పాత్ర!

గుర్తించిన సీబీడీటీ

తాజాగా హైదరాబాద్‌ సహా 42 ప్రాంతాల్లో సోదాలు

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ అధికారులు రూ.3,300 కోట్ల విలువైన హవాలా రాకెట్‌ను గుర్తించినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. మౌలిక సదుపాయాల రంగంలోని ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల పాత్ర ఇందులో ఉన్నట్టు పేర్కొంది. కాకపోతే ఆయా కంపెనీల వివరాలను సీబీడీటీ గోప్యంగా ఉంచింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ తదితర నగరాలకు ఈ రాకెట్‌ విస్తరించినట్టు తెఇపింది. భారీ పన్ను ఎగవేతలను గుర్తించేందుకు ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, ఈరోడ్, పుణె, ఆగ్రా, గోవాలోని 42 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించినట్టు వెల్లడించింది.

‘‘సోదాలు ఫలితాన్నిచ్చాయి. బడా కార్పొరేట్లు, హవాలా ఆపరేటర్ల మధ్య ఉన్న బంధం తాలూకూ ఆధారాలు లభించాయి. బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా రూ.3,300 కోట్ల మేర నిధులను కాజేసిన వ్యవహారం వెలుగు చూసింది’’అని సీబీడీటీ తన ప్రకటనలో తెలిపింది. బోగస్‌ కాట్రాక్టులు, బిల్లుల ద్వారా ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీలు నడిపించిన నగదు ప్రవాహ రాకెట్‌ వ్యవహారం వెలుగుచూసినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వ్యక్తికి రూ.150 కోట్ల నగదు చెల్లింపునకు సంబంధించి ఆధారాలు కూడా లభించినట్టు తెలిపింది.    

మరిన్ని వార్తలు