పీఎస్‌బీలకు తగ్గనున్న మూలధన భారం

21 Nov, 2018 00:05 IST|Sakshi

రూ.35,000 కోట్ల మేర తగ్గొచ్చు: క్రిసిల్‌

ముంబై: మూలధన పరిరక్షణ కోసం ఉద్దేశించిన నిల్వలను (సీసీబీ) తగిన స్థాయిలో సమకూర్చుకునేందుకు మరింత గడువు లభించడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులపై (పీఎస్‌బీ) ఈ ఆర్థిక సంవత్సరం రూ.35,000 కోట్ల మేర భారం తగ్గుతుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఒక నివేదికలో పేర్కొంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీల మూలధన అవసరాల అంచనాలు రూ.1.2 లక్షల కోట్ల నుంచి రూ. 85,000 కోట్లకు తగ్గుతాయని వివరించింది.

అయితే, బ్యాంకుల పనితీరు ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో కేంద్రమే ఈ నిధులను సమకూర్చాల్సి రావొచ్చని క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కృష్ణన్‌ సీతారామన్‌ తెలిపారు. సీసీబీ విధానాన్ని 2008లో ప్రవేశపెట్టారు. దీని కింద అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు వచ్చేలా సాధారణ సమయాల్లో బ్యాంకులు కొంత క్యాపిటల్‌ బఫర్‌ను సిద్ధం చేసుకుంటూ ఉండాలి.

నిబంధనల ప్రకారం సెప్టెంబర్‌ 30 నాటికి బ్యాంకులు 8.875% క్యాపిటల్‌ అడెక్వసీ రేషియోను పాటించాలి. ఇందులో సీసీబీ వాటా 1.875%. సీసీబీని వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 0.625% పెంచుకోవాల్సి ఉంది. అయితే, ఈ గడువును 2020 మార్చి దాకా పొడిగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

మరిన్ని వార్తలు