RBI: వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. లోన్ తీసుకున్న వారికి శుభవార్త

8 Dec, 2023 12:10 IST|Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోనిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee) సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు RBI గవర్నర్ 'శక్తికాంత దాస్' వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆర్‌బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా ఉంచడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో కీలక వడ్డీ రేట్లను 6.5శాతం దగ్గరే ఉంచాలని మొనేటరీ పాలసీ మీటింగ్​లో ఏకగ్రీవంగా అంగీకరించింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును 6.75 శాతం వద్దకే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుంది. ఓ వైపు అప్పుడు పెరగటం, మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా గత ఏడాది నుంచి వడ్డీ రేట్లను 2.5 శాతం పెంచుతూ వచ్చిన ఆర్​బీఐ.. గత నాలుగు సార్లు వడ్డీరేట్లను ఏ మాత్రం పెంచలేదు, ఇప్పుడు ఐదోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది.

ఆర్‌బీఐ 2023 - 24లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. మూడో త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.7 శాతం, 6.5 శాతం, 6.4 శాతంగా ఉండే అవకాశం ఉండొచ్చని సమాచారం.

>
మరిన్ని వార్తలు