ఆర్థిక లక్ష్యాలకు.. సిప్ సిప్ హుర్రే!!

7 Aug, 2016 23:37 IST|Sakshi
ఆర్థిక లక్ష్యాలకు.. సిప్ సిప్ హుర్రే!!

వీలైనంత ముందు నుంచీ పెట్టుబడి బెటర్ 
క్రమం తప్పకుండా చేయటం వల్ల లాభాలు
మార్కెట్లు తగ్గినా ఆ మేరకు సిప్ యూనిట్ల పెరుగుదల
కాంపౌండింగ్ మహిమతో చక్కని నిధి సమకూరే చాన్స్

సొంత ఇల్లు సమకూర్చుకోవడం... కారు కొనుక్కోవడం .. బోలెడంత డబ్బుతో చీకూ చింత లేని రిటైర్మెంట్ జీవితం గడపడం.. ఇలా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక ఆర్థిక లక్ష్యం.. కల ఉంటాయి. జీవితంలో ముందుకెళ్ళాలంటే  ఇలాంటి లక్ష్యాలు అవసరం కూడా. అయితే వీటికోసం నిజంగానే సరిగ్గా డబ్బును.. సమయాన్ని సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అన్నది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఆర్థిక లక్ష్యాల సాకారం కోసం కొంచెం కొంచెంగానైనా సరే... ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే అంత మంచిది.

ఇందుకు ఉపయోగపడే ఇన్వెస్ట్‌మెంట్ విధానాల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) అత్యంత ప్రధానమైనది. మెరుగైన రాబడులు అందుకోవడానికి.. మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో స్మార్ట్‌గా, సింపుల్‌గా ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడే విధానమిది. వారం వారీ గానీ నెలవారీగానీ లేదా మూణ్నెల్లకోసారి గానీ.. సులభంగా ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు కల్పిస్తుందీ సిప్. నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంతో పోలిస్తే తక్కువ రిస్కు ఉండే సిప్ విధానం పెట్టుబడులతో పలు ప్రయోజనాలున్నాయి.

 సిప్ ప్రయోజనాలు చాలా..
మార్కెట్ల హెచ్చుతగ్గులతో ప్రమేయం లేకుండా యావరేజింగ్ ప్రాతిపదికన ప్రయోజనాలు అందించడం సిప్ విధానంలో ప్రత్యేకత. ఎందుకంటే మార్కెట్ కదలికల  బట్టి మ్యూచువల్ ఫండ్ పథకాల విలువలు మారుతుంటాయి.  మీరు ప్రతి నెలా ఒకే మొత్తం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా .. దీనికి తగ్గట్లుగానే యూనిట్లు లభిస్తాయి. ఉదాహరణకు మార్కెట్ అధిక స్థాయిల్లో ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు లభిస్తాయి. అలాగే తక్కువ స్థాయిలో ఉంటే ఎక్కువ యూనిట్లు వస్తాయి. దీనివల్ల మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. సగ టున మీ ఖాతాలో ఒక మోస్తరు స్థాయిలో జమవుతూనే ఉంటాయి.

 కాంపౌండింగ్ పని చేసేదిలా..
కాంపౌండింగ్ ప్రభావంతో మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం మీద వచ్చే రాబడులు కూడా పెట్టుబడిలో భాగంగా మారతాయి. కాబట్టి అవి కూడా రాబడి అందిస్తాయి. ఫలితంగా దీర్ఘకాలంలో పెద్ద మొత్తం జమవుతుంది. ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్‌కి మధ్యలో అవాంతరమేదైనా వచ్చి కొంత కాలం ఆపేసినా కూడా మీరు అప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన దానిపై రాబడులు రావడం కొనసాగుతూనే ఉంటుంది.

చివరిగా చెప్పొచ్చేదేమిటంటే.. ప్రత్యేకంగా ఆర్థిక లక్ష్యమంటూ పెట్టుకోకుండా చేసే పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ సరిగ్గా ఉండదు. కాబట్టి మీ ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్నాక, దేనికి ఎంత అవసరమవుతుందో లెక్కవేసుకోవాలి. పెట్టుబడి లక్ష్యం, మీ రిస్క్ సామర్థ్యాలే ఫండ్ పోర్ట్‌ఫోలియో స్వరూపాన్ని నిర్దేశిస్తాయి.  వీటిని బట్టి మ్యూచువల్ ఫండ్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు సాగండి.

మీ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు మ్యూచువల్ ఫండ్ సిప్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.
వయసు పెరిగాక కాకుండా యుక్త వయసు నుంచే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే తక్కువ మొత్తం పెట్టుబడితో ఎక్కువ నిధిని సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. రాజు, శ్రీనుల ఉదాహరణే తీసుకుంటే.. రాజు ముప్ఫై ఏళ్ల వయస్సు నుంచే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో అతను నెలకు కేవలం రూ. 3,000 ఇన్వెస్ట్ చేస్తూ అరవై ఏళ్లప్పుడు రిటైర్మెంట్ నాటికి గణనీయమైన మొత్తాన్ని సమకూర్చుకున్నాడు. మరోవైపు శ్రీను నలభై ఏళ్లు వచ్చినప్పట్నుంచీ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అయితే,  నెలకు రూ. 5,000 మొత్తం ఇన్వెస్ట్ చేసినా కూడా అతను రిటైర్మెంట్ నాటికి రాజు సమకూర్చుకోగలిగినంత అందుకోలేకపోవచ్చు. (ఏటా 15 శాతం మేర రాబడులు వస్తాయనే అంచనాలతో).

మరిన్ని వార్తలు