డీఎల్‌ఎఫ్‌ లాభం 76% అప్‌ 

23 May, 2019 00:14 IST|Sakshi

రెండు రెట్లు పెరిగిన బుకింగ్స్‌ 

రూ.2,661 కోట్లకు మొత్తం ఆదాయం  

న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో క్వార్టర్‌లో 76 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.248 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.437 కోట్లకు పెరిగిందని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. అమ్మకాల బుకింగ్స్‌ దాదాపు రెట్టింపై రూ.2,435 కోట్లకు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.1,846 కోట్ల నుంచి రూ.2,661 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  

ఏడాది లాభం.. రూ.1,319 కోట్లు.... 
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.4,464 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,319 కోట్లకు తగ్గిందని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రెంటల్‌ ఆదాయాన్ని విక్రయించడం వల్ల అప్పుడు విశేషమైన లాభాలు వచ్చాయని, దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.7,664 కోట్ల నుంచి రూ.9,029 కోట్లకు పెరిగిందని తెలిపింది. నికర అమ్మకాలు రూ.1,000 కోట్ల నుంచి రూ.2,435 కోట్లకు పెరిగాయని పేర్కొంది. రెసిడెన్షియల్‌ సెగ్మెంట్‌లో అమ్మకాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయని వివరించింది. ప్రీమియమ్, లగ్జరీ సెగ్మెంట్లలో నివసించడానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లను విక్రయించడం ఆరంభించామని పేర్కొంది.  క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌(క్యూఐపీ) ద్వారా రూ.3,173 కోట్ల నిధులను విజయవంతంగా సమీకరించామని కంపెనీ తెలిపింది. ప్రమోటర్లు రూ.11,250 కోట్ల మేర పెట్టుబడులు అందించారని వివరించింది.  
మెరుగైన ఫలితాలతో బీఎస్‌ఈలో డీఎల్‌ఎఫ్‌ షేర్‌ 1.5% లాభంతో రూ.173 వద్ద ముగిసింది. 

>
మరిన్ని వార్తలు