భారత సీఈఓలతో 25న ట్రంప్‌ భేటీ

15 Feb, 2020 08:14 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ఇరు దేశాల వాణిజ్య బంధం మరింత బలపడటం కోసం ఫిబ్రవరి 25న ఢిల్లీలో ఆయన కార్పొరేట్‌ ప్రముఖులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన్ను కలిసేందుకు సిద్ధంగా ఉన్న దిగ్గజ సీఈఓల జాబితాలను భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి పంపిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్రంప్‌ను కలవనున్న ప్రముఖుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఏ.ఎం నాయక్, బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా ఉన్నారు.  

మరిన్ని వార్తలు