కారు రెన్యూవల్ మరవద్దు...

6 Jul, 2014 01:04 IST|Sakshi
కారు రెన్యూవల్ మరవద్దు...

కరెంటు బిల్లో, క్రెడిట్ కార్డు కనీస బకాయిలో చెల్లించడం మర్చిపోతే జరిగే పరిణామాలు మనకు తెలుసు. పెనాల్టీలు పడతాయి. సేవలు ఆగిపోతాయి. మోటారు వాహన బీమా రెన్యూవల్ కూడా ఇలాంటిదే. వెహికల్ ఇన్సూరెన్సును ప్రతి ఏటా రెన్యూవల్ చేయాల్సిందే. పాలసీ తీసుకున్న రోజు అర్ధరాత్రి నుంచే వాహన బీమా అమల్లోకి వస్తుంది. రెన్యూవల్ చేయించకపోతే ఆగిపోతుంది. ఆ తర్వాత మీ వాహనానికి బీమా కావాలంటే అందుకు సుముఖంగా ఉండే కంపెనీ వద్ద కొత్త పాలసీని కొనాల్సిందే.
 
ఏవో పనుల ఒత్తిడిలో కొందరు మోటారు ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను మర్చిపోతారు. కానీ, చాలామంది వాహన యజమానులు కొన్ని వందల రూపాయలు ఆదా అవుతాయనే ఉద్దేశంతో రెన్యూవల్‌ను నిర్లక్ష్యం చేస్తారు. తర్వాత ఊహించనిదేదైనా జరిగి వాహనానికి మరమ్మతులు చేయించాలంటే సొంత సొమ్ము వదిలించుకోవాల్సిందే. అంతేకాదు, నో క్లెయిమ్ బోనస్‌నూ కోల్పోతారు. వాహన ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కూడా వాహన యజమానిపై పడుతుంది.

వాహన బీమా రెన్యూవల్ ఒక్కరోజు ఆలస్యమైనా పాలసీ మురిగిపోతుంది. తర్వాత అదే పాలసీని పొందాలంటే, కొత్త పాలసీ తీసుకున్నంత పనవుతుంది. వాహనాలకు సమగ్ర (కాంప్రిహెన్సివ్) పాలసీ తీసుకోవడం మేలు. ఇలాంటి పాలసీకి ప్రీమియం చెల్లించాల్సిన గడువు ముగిసిపోయాక రెన్యూవల్ చేయించాలనుకుంటే సంబంధిత బీమా కంపెనీ మీ వాహనాన్ని తనిఖీ చేస్తుంది. వాహనం ఎక్కడైనా దెబ్బతిందా, ఏ భాగమైనా ధ్వంసమైందా అనే అంశాలను పరిశీలిస్తుంది. వాహనానికి డామేజీలుంటే, వాటికి బీమా కవరేజీ ఉండదు. మురిగిపోయిన పాలసీల రెన్యూవల్‌కు బీమా కంపెనీలు అధిక ప్రీమియం వసూలు చేయవచ్చు. లేదంటే బీమా ప్రతిపాదననే తిరస్కరించవచ్చు.
 

వాహన పాలసీని ఏటా రెన్యూవల్ చేయిస్తూ, ఎలాంటి క్లెయిమ్‌లూ దాఖలు చేయకపోతే నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సీబీ) వస్తుంది. తర్వాతి ఏడాది మీరు చెల్లించాల్సిన ప్రీమియంను కంపెనీ తగ్గిస్తుంది. క్లెయిమ్‌లు చేయని సంవత్సరాలు ఎక్కువగా ఉంటే ప్రీమియంలో డిస్కౌంటు 50 శాతం వరకూ ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినపుడు ఎన్‌సీబీ ప్రయోజనాలను బదిలీ చేసుకోవచ్చు. వాహనం ఎలాంటి బీమా లేకుండా 90 రోజులకు పైగా ఉంటే ఎన్‌సీబీ ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. పాత వాహనాలతో పోలిస్తే కొత్త వాటిపై బీమా ప్రీమియం చాలా హెచ్చుగా ఉంటుంది. ఈ సమస్యలన్నిటినీ అధిగమించాలంటే వాహనాల పాలసీలను క్రమం తప్పకుండా రెన్యూవల్ చేయించాలి.

మరిన్ని వార్తలు