ఫేస్‌బుక్ వారధి అయిన ప్రేమకథ..!

6 Jul, 2014 01:02 IST|Sakshi
ఫేస్‌బుక్ వారధి అయిన ప్రేమకథ..!

హృదయం: వయసు తేడా, వేరు వేరు దేశాలు, భిన్నమైన నాగరికతలు..  వాళ్లిద్దరి మధ్య తేడాల జాబితా రాసుకొంటూ పోతే చాంతడంత అవుతుంది. అయితే వాళ్లిద్దరూ ‘ప్రేమ’తో దగ్గరయ్యారు! ఫేస్‌బుక్ వారధిగా ఏకమయ్యారు! సోషల్‌నెట్‌వర్కింగ్‌సైట్ ఫేస్‌బుక్ ద్వారా మారిపోయిన జీవితాలను, సంభవించిన అశ్చర్యకరమైన సంఘటనలను నోట్‌చేయాల్సి వస్తే... ముందుగా ఆ సైట్ ఫౌండర్ మార్క్‌జుకెర్‌బర్గ్ జీవితాన్ని ప్రస్తావించుకోవాలి, ఆ తర్వాత  ఆండ్రియానా, ముఖేశ్‌ల ప్రేమ కథనే ప్రస్తావించుకోవాలి. ఎక్కడి అమెరికా, మరెక్కడి హర్యానాలోని పోప్రా గ్రామం. ఈ రెండు ప్రాంతాల మధ్య  ప్రేమబంధమే ఈవారం ‘హృదయం’.
 
 ఆండ్రియానా పారెల్(41), ముఖేశ్ కుమార్ రోర్(25) వీళ్ల వయసుల మధ్య ఎంత తేడా ఉందో... వీళ్ల సంస్కృతి, సంప్రదాయాలు, భాష, ప్రాంతం, దేశాల మధ్య కూడా అంతే తేడా ఉంది. ఫేస్‌బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయమే స్నేహంగా చిగురించింది, ప్రేమగా మారింది. పరిస్థితుల మధ్య ఎంత వ్యత్యాసం ఉన్నా... పెళ్లి చేసుకొని ఏకమైయ్యేంత వరకూ వెళ్లింది. ఇప్పుడు ప్రపంచంలోనే ఒక భిన్నమైన ప్రేమకథగా నిలిచింది.
 
 ఈ కమ్యూనికేషన్  యుగంలో విభిన్నదేశాలకు చెందిన వాళ్లు పెళ్లి చేసుకోవడం చెప్పుకోవాల్సినంత విశేషం ఏమీ కాదు. చాలా మంది అమలాపురం అబ్బాయిలు కూడా అమెరికా అమ్మాయిలను పెళ్లి చేసుకొంటున్నారు, అనేక మంది తెలుగుమ్మాయిలు ఆస్ట్రేలియన్ అబ్బాయిలను వివాహం చేసుకొంటున్నారు. అయితే ఆ ప్రేమకథలన్నీ ఒక ఎత్తు. ఆ క థల్లో మన వాళ్లు అమెరికాలో చదువుకోవడమో, అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే పరిచయం అయిన వాళ్లను వివాహం చేసుకోవడమో కామన్‌గా జరిగింది. కానీ ఆండ్రియానా ముఖేశ్‌లు ప్రేమలో పడేంత వరకూ దేశ సరిహద్దులు దాటలేదు. ఎవరి దేశంలో వాళ్లు ఉండి, ఆన్‌లైన్ ద్వారానే దగ్గరయ్యి... పరిస్థితుల గురించి పూర్తి అవగాహన తెచ్చుకొన్న తర్వాతే ఒకరినొకరు ప్రత్యక్షంగా చూసుకొన్నారు.
 
 ఆండ్రియానా ఫేస్‌బుక్ అకౌంట్‌కు ముఖేశ్ అకౌంట్ నుంచి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ వెళ్లింది. మాస్ కమ్యూనికేషన్ గ్రాడ్యుయేట్ అయినా ముఖేశ్ ఆమెతో ఇంగ్లిష్ లో కమ్యూనికేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. వచ్చిరాని ఇంగ్లిష్‌లో చాట్ చేస్తూ ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నించాడు. ముందుగానే రాసిపెట్టి ఉందో ఏమోకానీ ముఖేశ్ రాతలు ఆమెకు బాగా నచ్చాయి. అతడి ప్రేమప్రతిపాదనకు ఓకే చెప్పింది! కొన్ని రోజుల పాటు చాటింగ్ చేసుకొన్న తర్వాత భారత్ రావాలని నిర్ణయించుకొంది.

 అయితే ఆ సమయంలో ఆమెను చాలా మంది వారించారట. ట్రెడిషినల్ అమెరికన్ గర్ల్‌గా జీవితాన్ని ఆస్వాదిస్తున్న నువ్వు గ్రామీణ భారతీయుడితో ప్రేమలో పడటం ఏమిటి విచిత్రం! అని కొందరు... అసలు ఆ అకౌంట్ ఫేక్ అయితే ఏం చేస్తావు? అని మరికొందరు ఆమెను ఇండియా రాకుండా చేయడానికి ప్రయత్నించారట. కానీ ఆమె వాళ్ల హెచ్చరికలను ఖాతరు చేయలేదు. తన ప్రేమ నిజమే అయితే ముఖేశ్ అకౌంట్ కూడా నిజమే, అతడు తనను ప్రేమిస్తున్న మాట కూడా నిజమే అనుకొని ముఖేశ్ వాళ్ల గ్రామంలో వాలిపోయింది.
 
 ప్రేమ విషయంలో చేసే త్యాగాల్లో ‘గొప్ప’ అనేదానికి ప్రామాణికం ఏమీ లేదు. ఆ అమెరికన్ మహిళ ఒక భారతీయుడిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడమే గొప్ప అనుకొంటే.. అతడి కోసం తను గ్రామీణ భారతీయ వాతావరణంలోనే కలిసిపోయి  ఆమె ప్రేమలోని అసలైన గొప్పదనాన్ని చాటింది. భారతీయ సంప్రదాయబద్ధంగా జరిగింది ముఖేశ్, ఆండ్రియానాల వివాహం. పెళ్లి తర్వాత వాళ్లిద్దరూ అమెరికా వెళ్లిపోతారని ముఖేశ్ గ్రామంలోని జనాలు అనుకొన్నారు. అయితే పెళ్లి తర్వాత అతడి అభీష్టం మేరకు ఆమె ఆ గ్రామంలోనే ఉండటానికి సిద్ధ పడింది. అందుకు తగ్గట్టుగా తన కట్టూబొట్టును పూర్తిగా మార్చేసింది. అచ్చమైన హర్యానా గృహిణిలా మారిపోయింది.
 
 వీళ్ల ప్రేమకథ గురించి తెలుసుకొన్న జర్నలిస్టులు ఆమె అమెరికన్ లైఫ్‌స్టైల్‌కు, ఇప్పుడు హర్యానాలో గృహిణిగా గడుపుతున్న శైలికి పోలిక పెడుతూ ప్రేమకథను అంతర్జాతీయ మీడియా ద్వారా ప్రెజెంట్ చేశారు. మీలో ఇంత మార్పు ఎలా సాధ్యం? అని కూడా ఆమెను మీడియా అడిగింది. ‘ఫ్యాన్సీ టాయిలెట్ లేదా, పవర్ షవర్ నాకు ఆనందాన్ని ఇవ్వలేదు, నా జీవితంలో ప్రేమంటే ఏమిటో ముఖేశ్ వల్లనే అర్థమయ్యింది. అతడితో కలిసుండటంలో ఉన్న ఆనందం చెప్పలేనంత! అందుకోసం నేను ఎలా మారిపోగలను, దేన్నైనా వదులకోగలను..’’ అంటూ తన ప్రేమను, తనపై ముఖేశ్‌కు ఉన్న ప్రేమను తన మాటల్లోనే ఆవిష్కరించింది. మరి ప్రేమకున్న గొప్పదనంలో ఆండ్రియానా మాటలు ఒక పార్శ్వం అనడంలో ఏమైనా సందేహమా!

మరిన్ని వార్తలు