డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ లాభం 19% డౌన్‌

5 Feb, 2017 01:44 IST|Sakshi
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ లాభం 19% డౌన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ నికర లాభం 19 శాతం క్షీణించి రూ. 470 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ3లో ఇది రూ. 579 కోట్లు. ఇక తాజాగా ఆదాయం 7 శాతం క్షీణతతో రూ. 3,968 కోట్ల నుంచి రూ. 3,707 కోట్లకు తగ్గింది. ఉత్తర అమెరికా మార్కెట్లలో అమ్మకాలు మందగించడం లాభాల క్షీణతకు కారణమని శనివారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో కంపెనీ సీఎఫ్‌వో సౌమేన్‌ చక్రవర్తి తెలిపారు.

నాలుగో త్రైమాసికంలోనూ అమెరికాలో ధరలపరమైన ఒత్తిళ్లు కొంత మేర ఉండొచ్చని కంపెనీ సీవోవో అభిజిత్‌ ముఖర్జీ పేర్కొన్నారు. అనుమతులు పొందే కొత్త ఔషధాల సంఖ్య తక్కువగానే ఉండొచ్చని వివరించారు. మరోవైపు, వెనెజులా, ఉత్తర అమెరికాల్లో అమ్మకాల తగ్గుదలతో సమీక్షాకాలంలో గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం ఆదాయాలు 9 శాతం క్షీణించి రూ. 3,060 కోట్లకు పరిమితమయ్యాయి. కీలకమైన ఉత్తర అమెరికాలో ఆదాయాలు 15 శాతం తగ్గి రూ. 1,660 కోట్లకు క్షీణించాయి.

దివీస్‌ లాభం 9 శాతం అప్‌
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దివీస్‌ ల్యాబ్స్‌ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 268 కోట్లకు చేరింది. ఇక ఆదాయం రూ. 860 కోట్ల నుంచి రూ. 976 కోట్లకు పెరిగింది. నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 6 మధ్య కాలంలో తమ విశాఖపట్నం ప్లాంట్‌లోని రెండో యూనిట్‌లో అమెరికా ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. ఎఫ్‌డీఏ సూచనలకు సంబంధించి తాము చేపట్టిన దిద్దుబాటు చర్యలు మొదలైన వాటి గురించి ఇప్పటికే వివరణనిచ్చినట్లు పేర్కొంది. తదుపరి ఎఫ్‌డీఏ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది.

మరిన్ని వార్తలు