ఆర్థిక వృద్ధికి విభజన అక్కర్లేదు

8 Apr, 2014 02:14 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఆర్థిక పనితీరును మెరుగుపర్చడానికి చిన్న రాష్ట్రాల ఏర్పాటు పరిష్కారం కాదని ఇండియా రేటింగ్స్, రీసెర్చ్ (ఇండ్-రా) సంస్థ తెలిపింది. 2006 - 2013 మధ్యకాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల పనితీరును అధ్యయనం చేసిన ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే 11 రాష్ట్రాలు అధిక వేగంతో వృద్ధిని సాధించగా వీటిలో ఐదు మాత్రమే చిన్న రాష్ట్రాలు.

 అవి: ఉత్తరాఖండ్, కేరళ, హర్యానా, గోవా, హిమాచల్ ప్రదేశ్. 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లు మిశ్రమ పనితీరును కనబర్చడాన్ని బట్టి, చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసినంతమాత్రాన ఆర్థికాభివృద్ధికి భరోసా ఉండదని స్పష్టమవుతోందని, రాష్ట్రాల అభివృద్ధికి అక్కడి ప్రత్యేక పరిస్థితులు, విధాన నిర్ణయాలు కారణమని నివేదిక పేర్కొంది. కేవలం విభజన వల్లే వృద్ధి జరిగిందని చెప్పలేమని అభిప్రాయపడింది.

>
మరిన్ని వార్తలు