నీరవ్‌ మోదీకి ఈడీ సమన్లు

16 Feb, 2018 14:08 IST|Sakshi
నీరవ్‌ మోదీ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ మొత్తంలో కుంభకోణానికి పాల్పడిన డైమాండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ ప్రస్తుతం న్యూయార్క్‌లో తల దాచుకున్నట్టు తెలుస్తోంది. ఈయనపై ప్రస్తుతం సీబీఐ, ఈడీ ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నాయి. సీబీఐ ఇంటర్‌పోల్‌ను సంప్రదించగా.. ఈడీ, నీరవ్‌ మోదీకి సమన్లను జారీచేసింది. నీరవ్‌మోదీతో పాటు మెహల్‌ చౌక్సికి సమన్లు జారీచేస్తున్నట్టు ఈడీ పేర్కొంది. ప్రివెంక్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద వీరికి సమన్లు జారీచేసినట్టు తెలిపింది. అంతేకాక వారంలోపల వీరిని తమముందు హాజరవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం నీరవ్‌మోదీ న్యూయార్క్‌లో తన లగ్జరీ జువెల్లరీ స్టోర్‌కు దగ్గర్లో జేడబ్ల్యూ మారియట్ ఎస్సెక్స్‌ హౌజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. నీరవ్‌ పాస్‌పోర్టును కూడా ప్రభుత్వం రద్దు చేసినట్టు సమాచారం. అయితే నీరవ్‌ మోదీ వార్త కేవలం భారత్‌లోనే హల్‌చల్‌ చేస్తుందని, ఆయన మాత్రం న్యూయార్క్‌లో హ్యాపీగా ఉన్నారు కదా అంటూ? ఓ ఉద్యోగి ప్రశ్నించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.11వేల కోట్ల స్కాం చేసిన నీరవ్‌మోదీ జనవరి 1నే దేశం విడిచిపారిపోయారు. జనవరి 23న జరిగిన దావోసు సమావేశాల్లో పాల్గొన్నారు.

ప్రస్తుతం నీరవ్‌మోదీ, ఆయన భార్య ఇద్దరూ బయటికి వెళ్లారని, కేవలం పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారని అపార్ట్‌మెంట్‌ సిబ్బంది చెప్పారు.  మరోవైపు నీరవ్‌మోదీ, గీతాంజలి జెమ్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న జువెల్లరీ షోరూంలు, ఆఫీసులలో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఈ కేసులో భాగంగానే రూ.5100 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు వంటి పలు కీలక ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది.  ఈ స్కాంలో భాగమున్నట్టు అనుమానిస్తున్న మరో ఎనిమిది మంది ఉద్యోగులను బ్యాంకు సస్పెండ్‌ చేసింది. మొత్తం 18 ఉద్యోగులపై పీఎన్‌బీ వేటు వేసింది. అయితే నీరవ్‌ మోదీ కేసు వల్ల పీఎన్‌బీ రీక్యాపిటలైజేషన్‌ ప్లాన్‌లో ఎలాంటి మార్పు ఉండదని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు చెప్పాయి. గీతాంజలి జెమ్స్‌తో లింక్‌ అయి ఉన్న 36 సంస్థలపై విచారణ చేపట్టనున్నట్టు తెలిపాయి. మరోవైపు పీఎన్‌బీ బ్యాంకు షేర్లు వరుసగా మూడో రోజు భారీగా నష్టపోతున్నాయి. 52 వారాల కనిష్ట స్థాయికి ఈ షేర్లు పడిపోయాయి.

మరిన్ని వార్తలు