ఇసాబ్‌ భారీ డివిడెండ్‌- పతంజలి ఎన్‌సీడీలు హిట్‌

28 May, 2020 14:29 IST|Sakshi

షేరుకి రూ. 70 మధ్యంతర డివిడెండ్‌

ఇసాబ్‌ ఇండియా షేరు 19 శాతం జూమ్‌

పతంజలి రూ. 250 కోట్లు సమీకరణ

ఎన్‌సీడీలు 3 నిముషాల్లో సబ్‌స్ర్కయిబ్‌

ప్రధానంగా నిర్మాణ రంగ కంపెనీలకు కీలక ప్రొడక్టులను విక్రయించే విదేశీ అనుబంధ కంపెనీ ఇసాబ్‌ ఇండియా వాటాదారులకు భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. ఇక మరోవైపు.. వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాల కోసం బాబా రామ్‌దేవ్‌ గ్రూప్‌ కంపెనీ పతంజలి ఆయుర్వేద ఎన్‌సీడీల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టింది. ఇతర వివరాలు చూద్దాం..

ఇసాబ్‌ ఇండియా
వెల్డింగ్‌, కటింగ్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ దిగ్గజం ఇసాబ్‌ ఇండియా వాటాదారులకు భారీ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. షేరుకి 700 శాతం(రూ. 70) చొప్పున చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. జూన్‌ 23కల్లా వాటాదారులకు డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు రూ. 108 కోట్లను కేటాయించినట్లు వివరించింది. కోవిడ్‌-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌లో భాగంగా ఆంక్షలను సడలించడంతో దశలవారీగా ఉత్పత్తి కార్యక్రమాలకు తెరతీసినట్లు తెలియజేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలలోగల ప్లాంట్లు ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇసాబ్‌ ఇండియా షేరు 19 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 1304 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1310 వరకూ ఎగసింది.

పతంజలి ఆయుర్వేద
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం పతంజలి ఆయుర్వేద తొలిసారి జారీ చేసిన డిబెంచర్లు మూడు నిముషాలలోనే సబ్‌స్క్రయిబ్‌ అయ్యాయి. మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 250 కోట్లను సమీకరించినట్లు పతంజలి ఆయుర్వేద పేర్కొంది. దరఖాస్తుదారులకు 10.1 శాతం కూపన్‌ రేటుతో మూడేళ్ల కాలానికి ఎన్‌సీడీలను కేటాయించినట్లు తెలియజేసింది. రిడీమ్‌ చేసుకునేందుకు వీలైన వీటిని స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌చేసింది. పతంజలి ఎన్‌సీడీలకు బ్రిక్‌వర్క్‌ AA రేటింగ్‌ను ప్రకటించింది. వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాలు, సప్లై చైన్‌ పటిష్టతకు నిధులను వినియోగించనున్నట్లు పతంజలి పేర్కొంది. కాగా.. దివాళా బాట పట్టిన వంట నూనెల కంపెనీ రుచీ సోయాను గతేడాది డిసెంబర్‌లో పతంజలి ఆయుర్వేద సొంతం చేసుకున్న విషయం విదితమే. న్యూట్రెలా, సన్‌ రిచ్‌, రుచీ గోల్డ్‌, మహాకోష్‌ బ్రాండ్లను కలిగిన రుచీ సోయా కొనుగోలుకి రూ. 4350 కోట్లను వెచ్చించింది. 

మరిన్ని వార్తలు