గూగుల్, ఫేస్‌బుక్‌లకు వరదముప్పా..?

24 Apr, 2016 11:37 IST|Sakshi
గూగుల్, ఫేస్‌బుక్‌లకు వరదముప్పా..?

గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మనుషులకే కాదు. సంస్థలకూ నష్టమే. గరిష్ట ఉష్ణోగ్రతలతో భూమిపై నీటిశాతం పెరగడం సాప్ట్ వేర్ సంస్థలకు ముప్పు తెచ్చి పెడుతుంది. సిలికాన్ వాలీ దిగ్గజాలుగా ఉన్న ఫేస్ బుక్, గూగుల్, సిస్కో క్యాంపస్ లకు వరద ముప్పు తీవ్రంగా ఉండబోతుందని తెలుస్తోంది. వరద ముప్పుతో ఈ క్యాంపస్ లు మునిగిపోతాయని శాస్త్రవేత్తలు ఈ సంస్థలకు హెచ్చరికలు కూడా జారీచేశారు.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా దక్షిణ దిక్కును సిలికాన్ వాలీగా పిలుస్తారు. ఈ ఏరియా ప్రపంచంలోనే అతిపెద్ద హైటెక్ కంపెనీలకు నిలయంగా పేరొందింది. ఈ ప్రాంతంలోనే ఫేస్ బుక్, గూగుల్ ప్రధాన కార్యాలయాలున్నాయి. గ్లోబల్ వార్మింగ్ తో సముద్ర మట్టాలు పెరిగితే ఈ ప్రాంతం వరద ముప్పుకు గురవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల స్థాయిని తగ్గించుకున్నా ఈ తీవ్ర ప్రమాదం నుంచి ఆ సంస్థలు బయటపడలేవని తెలిపారు. సోషల్ మీడియా దిగ్గజంగా పేరొందిన ఫేస్ బుక్ కొత్త క్యాంపస్ వరద ముప్పుతో ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశముందని రిపోర్టులో తెలిపారు. తొమ్మిది ఎకరాల గార్డెన్ పైకప్పుతో 4 లక్షల 30వేల చదరపు అడుగుల సముదాయంలో ఈ కొత్త క్యాంపస్ ను శాన్ ఫ్రాన్సిస్కో బే తీరప్రాంతంలో నెలకొల్పారు.

ఆ ప్రాంతంలోనే మెన్లో పార్క్ బేస్ ను కూడా నెలకొల్పి క్యాంపస్ విస్తీర్ణాన్ని పెంచారు. అయితే ఈ క్యాంపస్ తీవ్ర ప్రమాదంలో ఉందని, అసలు కొత్త క్యాంపస్ కోసం ఫేస్ బుక్ ఈ స్థలాన్ని ఎలా ఎంచుకున్నదో తెలియడం లేదని కాలిఫోర్నియా బే పరిరక్షణ, అభివృద్ధి కమిషన్ సీనియర్ ప్లానర్ లిండీ లొవె అన్నారు. ఈ శతాబ్దం చివరికి 1.6 అడుగుల సముద్ర మట్టాలు ఎత్తు పెరిగితే, ఫేస్ బుక్ ను వరద ముప్పు నుంచి కాపాడలేమని తెలిపారు.
అదేవిధంగా అట్లాంటికా సముద్ర మట్టాలు 6 అడుగుల పెరిగితే, సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, టెక్నాలజీ కంపెనీ సిస్కో రెండూ కూడా తుడిచిపెట్టుకొని పోతాయని హెచ్చరికలు జారీ చేశారు. గ్లోబల్ వార్మింగ్ తో సముద్ర మట్టాలు పెరిగితే బే ఏరియాలోని 100 బిలియన్ డాలర్ల వాణిజ్య, నివాస ఆస్తులు ప్రమాదానికి గురవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీచేశారు.   
 

మరిన్ని వార్తలు