ఫెడ్‌ నిర్ణయం, రూపాయి కదలికలే కీలకం..!

24 Sep, 2018 00:37 IST|Sakshi

ఎఫ్‌ అండ్‌ ఓ రోల్‌ఓవర్స్‌ ప్రకారం ఒడిదుడుకులకు అవకాశం

బుధవారం వెల్లడికానున్నఫెడ్‌ వడ్డీరేట్ల నిర్ణయం

వాణిజ్య యుద్ధం, ముడిచమురుపై ఇన్వెస్టర్ల దృష్టి

న్యూఢిల్లీ: ఈవారంలో సూచీలు మరింత కన్సాలిడేషన్‌కు గురికావచ్చని మార్కెట్‌ పండితులు భావిస్తున్నారు. ముడి చమురు ధరల పెరుగుదల, డాలరు విలువ బలపడుతుండటం, ద్రవ్యలోటు వంటి పలు ఆందోళనకర అంశాల నేపథ్యంలో మార్కెట్‌ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.

‘అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం ఈవారంలో అత్యంత కీలక అంశంగా ఉంది. మన మార్కెట్లలో దిద్దుబాటు చోటుచేసుకుంటున్న క్రమంలో పలు రంగాలు, ఎంపిక చేసిన షేర్లలో వాల్యూ బయ్యింగ్‌కు అవకాశం కనిపిస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. ఇక శుక్రవారం వెల్లడికానున్న ద్రవ్యలోటు, ఆగస్టు ఇన్‌ఫ్రా డేటాలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని భావిస్తున్నారు.

వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం
ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం ప్రకటించనున్న వడ్డీ రేట్ల కోసం ప్రపంచదేశాల మార్కెట్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈసారి మరో 25 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

రీసెర్చ్‌ సంస్థ రాయిటర్స్‌ అంచనా ప్రకారం.. సెప్టెంబర్‌ 25–26 సమావేశంలో పాలసీ రేటు 2 నుంచి 2–25 శాతానికి పెరిగేందుకు అవకాశం ఉంది. ఎఫ్‌ఓఎమ్‌సీ సమావేశం నేపథ్యంలో ఈవారంలో కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు వీ కే శర్మ అన్నారు. గడిచిన సెషన్లలో చోటుచేసుకున్న కరెక్షన్‌ అనంతరం మార్కెట్‌ ఇంటర్‌మీడియట్‌ బోటమ్‌ను తాకినట్లు భావిస్తున్నామని వెల్లడించారు.

వెంటాడుతున్న వాణిజ్య యుద్ధ భయాలు
200 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను విధించగా.. చైనా సైతం 110 బిలియన్‌ డాలర్ల అమెరికా దిగుమతులపై సుంకాలను ప్రకటించింది. ఈ రెండు దేశాల ట్యారిఫ్‌లు కూడా సోమవారమే అమల్లోకిరానున్నాయి.

అమెరికా–చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగియకపోగా మరింత వేడెక్కే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ 72.91 స్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ముడిచమురు ధరలు, రూపాయి కదలికలపై దృష్టిసారిస్తున్నారు.

11,090 స్థాయిని కోల్పోతే మరింత దిగువకు
11,170 పాయింట్ల కీలక మద్దతు స్థాయిని కోల్పోయిన నిఫ్టీకి తక్షణ మద్దతు స్థాయి 11,090 వద్ద ఉందని, ఈ స్థాయిని కూడా కోల్పోతే మరింత కరెక్షన్‌ను చూడవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. పుల్‌బ్యాక్‌ ర్యాలీస్‌ నమోదైతే 11,250 అత్యంత కీలక నిరోధమని వివరించింది.

మరిన్ని వార్తలు