ఆ రాత్రి 20,000 ప్లేట్ల బిర్యానీ లాగించారు..

8 Jan, 2019 19:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో నూతన సంవత్సర వేడుకలంటే చిన్నా పెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాలతో కొత్త ఏడాదిని స్వాగతిస్తారు. 2018కి వీడ్కోలు పలుకుతూ 2019కు స్వాగతం చెబుతూ డిసెంబర్‌ 31 రాత్రి భారత్‌లో వేడుకలు మిన్నంటిన సంగతి తెలిసిందే. ఆ రోజు రాత్రి దేశవ్యాప్తంగా ప్రజలు 20,000కు పైగా ప్లేట్ల బిర్యానీని లాగించేశారని వెల్లడైంది.

డిసెంబర్‌ 31 రాత్రి దేశమంతటా వేలాది బిర్యానీ ప్లేట్లు సరఫరా చేశారని, కొత్త ఏడాదికి అరగంట చేరువలోనే వందలాది ఆర్డర్లను అందచేశారని ఆహార ఆర్డర్‌, సరఫరా సంస్థ ఫుడ్‌పండా పేర్కొంది. కొత్త ఏడాదిని స్వాగతిస్తూ జనం బిర్యానీతో పాటు బ్లాక్‌ ఫారెస్ట్‌ చాక్లెట్‌ కేక్‌, చికెన్‌ రోల్స్‌, బర్గర్లు, ఫ్రైడ్‌ రైస్‌ను ఆస్వాదించారని తెలిపింది.

2018 చివరి రోజున హైదరాబాద్‌, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బెంగళూర్‌, ముంబై, వైజాగ్‌ల్లో ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది. హైదరాబాదీలు ఎక్కువగా చికెన్‌ బిర్యానీని ఆర్డర్‌ చేయగా, ముంబై వాసులు మిల్క్‌షేక్‌లు, బర్గర్ల వైపు మొగ్గుచూపారని,ఇక దేశ రాజధాని ఢిల్లీ పౌరులు టిక్కా, బటర్‌ చికెన్‌లను ఇష్టంగా తిన్నారని తేలింది. ఇక ఐటీ సిటీగా పేరొందిన బెంగళూర్‌లో ఎక్కువగా చక్కెర లేని జ్యూస్‌లు, సలాడ్లను ఆర్డర్‌ చేశారని ఫుడ్‌పండా పేర్కొంది.

మరిన్ని వార్తలు