ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంపై వచ్చే నెలలో నివేదిక!

30 Dec, 2016 01:35 IST|Sakshi
ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంపై వచ్చే నెలలో నివేదిక!

ఆర్‌బీఐ సలహాల అనంతరం కేంద్రానికి అందజేత
అయితే బడ్జెట్‌ తరువాతే నివేదిక అంశాలు బహిర్గతం


న్యూఢిల్లీ: ఎఫ్‌ఆర్‌బీఎం (ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ) చట్టం పనితరు సమీక్షకు నియమించిన కమిటీ వచ్చే నెల 13వ తేదీన  నివేదికను సమర్పించనుందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అయితే తన నివేదికను కేంద్రానికి సమర్పించే ముందు కమిటీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అభిప్రాయాలను కూడా తీసుకుంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. మాజీ రెవెన్యూ శాఖ కార్యదర్శి ఎన్‌కే సింగ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన  ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్‌ సమీక్షా కమిటీని కేంద్రం మే నెలలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  12 సంవత్సరాల నుంచీ ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్‌ అమలు జరుగుతోంది.

ముఖ్యాంశం ద్రవ్యలోటే..!
ద్రవ్యలోటును వార్షికంగా  ఒక స్థిరమైన లక్ష్యంగా నిర్దారించుకోకుండా, ఒక శ్రేణిని నిర్ణయించుకోవడంపై సాధ్యాసాధ్యాలు సమీక్షా అంశాల్లో ఒకటి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం – చేసే వ్యయాల మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు.  ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున, ఈ లోపే ఎన్‌కే సింగ్‌ కమిటీ సిఫారసులు కేంద్రానికి చేరనుండడం గమనార్హం. నిజానికి ఈ కమిటీ తన నివేదికను ఈ ఏడాది అక్టోబర్‌ 31వ తేదీ నాటికే సమర్పించాల్సి ఉంది. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫారసులను, వ్యయ నిర్వహణ కమిషన్‌ పనితీరును సమీక్షించాలన్న అదనపు బాధ్యతల రీత్యా కమిటీ కాలపరిమితిని కేంద్రం పొడిగించింది. కాగా వచ్చే నెల మొదట్లోనే నివేదిక సమర్పించినా, బడ్జెట్‌ వరకూ ఈ నివేదిక అంశాలు వెల్లడికాబోవని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

ఐదుగురు సభ్యుల్లో...
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన ఐదుగురు సభ్యుల కమిటీలో మాజీ ఆర్థిక కార్యదర్శి సుమిత్‌ బోస్, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం, అప్పటి ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ (ప్రస్తుత గవర్నర్‌) ఉర్జిత్‌ పటేల్, ఎన్‌ఐపీఎఫ్‌పీ డైరెక్టర్‌ రతన్‌ రాయ్‌లు ఉన్నారు. 2015–16లో ద్రవ్యలోటు 3.9 శాతం (జీడీపీతో పోల్చిచూస్తే). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ లక్ష్యాన్ని 3.5 శాతంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించింది. ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్న దృష్ట్యా 2016–17 బడ్జెట్‌ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందన్న అంచనాలు ఆర్థికవేత్తల నుంచి వెలువడ్డాయి. అయితే అరుణ్‌జైట్లీ 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యానికే కట్టుబడి ఉన్నట్లు తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు