తొలి ఫైబర్‌గ్రిడ్‌ గ్రామం మోరి! | Sakshi
Sakshi News home page

తొలి ఫైబర్‌గ్రిడ్‌ గ్రామం మోరి!

Published Fri, Dec 30 2016 1:27 AM

తొలి ఫైబర్‌గ్రిడ్‌ గ్రామం మోరి! - Sakshi

ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది: సీఎం చంద్రబాబు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో తొలి ఫైబర్‌ గ్రిడ్‌ను మారుమూల గ్రామమైన మోరిలో ఏర్పాటు చేశామని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు  అన్నారు. 2022 నాటికి రాష్ట్రం దేశంలోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా, 2029కి భారత్‌లో అభివృద్ధికి చిరునామాగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో ఫైబర్‌గ్రిడ్‌ పైలెట్‌ ప్రాజెక్టును  చంద్రబాబు గురువారం ఆవిష్కరించారు. ఇదే గ్రామాన్ని నగదు రహిత, బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ప్రకటించారు.

తొలుత భర్కలీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అయిన సాల్మాన్‌ డార్విన్‌ ఆధ్వర్యంలో 42 కంపెనీ లకు చెందిన ప్రతినిధులతో సీఎం ఫైబర్‌ గ్రిడ్, ఎల్‌ఈడీ, వాటర్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ క్లాస్‌ తదితర విషయాలపై చర్చలు జరిపారు. అనంతరం జరిగిన సభలో  మాట్లాడుతూ... గత యూపీఏ ప్రభుత్వంలో మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఫైబర్‌ గ్రిడ్‌ తీసుకువస్తానని చెప్పి విఫలమయ్యా రని, తాను మాత్రం ప్రణాళికాబద్ధంగా దీన్ని సాధించానన్నారు. సిలికాన్‌ వ్యాలీ కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేదన్నారు. రూ. 149కు ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా ఇంటర్‌నెట్, 250కి పైగా చానళ్లు, ప్రపంచంలో ఎక్కడికైనా వీడియో కాల్‌ మాట్లాడుకునే అవకాశం ఉంటుందన్నా రు. ఈ గ్రామం నుంచి త్వరలో మినీ శాటిౖ లెట్‌లు తయారు చేసి అంతరిక్షంలోకి పంప నున్నారని బాబు చెప్పారు.

అధికారులు విఫలం
పెదనోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న అనేక ఇబ్బందులను చూసి చాలా బాధపడ్డానని, పరిస్థితి చక్కదిద్దడంతో అధికారులు విఫల మయ్యారని, వారికి చీవాట్లు పెట్టానని సీఎం చంద్రబాబు అన్నారు. చివరకు ఆర్‌బీఐతో మాట్లాడి నగదు రప్పించానని తెలిపారు. నగదు రహిత లావాదేవీల కోసం రూ. రెండు వేలు విలువజేసే బయోమెట్రిక్‌ మిషన్లకు ప్రభుత్వం రూ.వెయ్యి రాయితీ ఇస్తుందన్నారు. సభలో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప,  మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement