-

మరింత కష్టాల్లోకి అంబానీ : మునగడమా? ఈదడమా?

23 Jul, 2018 16:19 IST|Sakshi
రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత అనిల్‌ అంబానీ

న్యూఢిల్లీ : రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత అనిల్‌ అంబానీ మరింత కష్టాల్లోకి కూరుకుపోతున్నారు. ఇప్పటికే అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న ఆయనకు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ నోటీసులు జారీ చేసింది. రాబోయే స్పెక్ట్రం చెల్లింపు బకాయిల కింద బ్యాంకు హామీలలో భాగంగా 774 కోట్ల రూపాయలు చెల్లించకపోతే లైసెన్సు రద్దు చేస్తామని డీఓటీ హెచ్చరించింది. ఈ నెల చివరి వరకు వీటిని చెల్లించాలని ఆదేశించింది. రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు తన ఆస్తులు అమ్మి రుణాలు తీర్చుకోవాలని భావిస్తున్న అనిల్‌ అంబానీ కంపెనీకి, డీఓటీ ఈ నోటీసులు జారీచేయడం మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ప్రస్తుతం అంబానీ పరిస్థితి సముద్రంలో మునగడమా? ఈదడమా? అనే రీతిలో ఉందని టెలికాం విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు ఉన్న రూ.46వేల కోట్ల అప్పులను తీర్చేందుకు తన వైర్‌లెస్‌ ఆస్తులను అన్న ముఖేష్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ జియోకు విక్రయిస్తోంది. దీంతో రూ.18వేల కోట్ల మేర రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఆర్జిస్తోంది. 

జూన్‌ చివరి వారంలోనే ఆర్‌కామ్‌కు డీఓటీ ఈ షోకాజు నోటీసు జారీచేసినట్టు తెలిసింది. ఈ నెల ప్రారంభంలోనే తాము నోటీసులు అందుకున్నామని, దానికి సమాధానం కూడా ఇచ్చినట్టు కంపెనీకి చెందిన అధికారులు చెప్పారు. బ్యాంకు గ్యారెంటీల కింద రూ.774కోట్లను చెల్లిస్తామని తెలిపారు. అయితే టెలికాం డిస్‌ప్యూట్‌ సెటిల్‌మెంట్‌ అండ్‌ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌(టీడీశాట్‌) ఆదేశాల ప్రకారం బ్యాంక్‌ గ్యారెంటీల మొత్తాన్ని డీఓటీ తిరిగి ఇచ్చేయాల్సి ఉందని పేర్కొంది. అయితే తాము బ్యాంక్‌ గ్యారెంటీలు వెంటనే చెల్లించకపోతే, డీఓటీకి ఎలాంటి నష్టం వాటిల్లదని కూడా ఆర్‌కామ్‌ తన లేఖలో పేర్కొంది. అయితే ఈ ఫండ్స్‌ను ఆర్‌కామ్‌ సమకూర్చుతుందో లేదో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ కంపెనీ బ్యాంక్‌ గ్యారెంటీలను నిర్దేశించిన సమయం లోపల చెల్లించకపోతే, కంపెనీని స్పెక్ట్రమ్‌ సేల్‌లో అనుమతించేందుకు డీఓటీ సమ్మతించకపోవచ్చని తెలుస్తోంది. దీంతో జియోతో డీల్‌ జాప్యమవుతుంది. ఒకవేళ అన్నట్టే లైసెన్స్‌లను రద్దు చేస్తే, లైసెన్స్‌ నిబంధనల ఉల్లంఘనల కారణంగా డీఓటీ హెచ్చరించినట్టు అవుతోంది. 

మరిన్ని వార్తలు