జీఐసీ మెగా ఐపీవో వచ్చేస్తోంది

5 Oct, 2017 13:09 IST|Sakshi

ఈనెల 11 నుంచి 13 వరకు

ఇష్యూ ధర రూ.855 – రూ.912

రూ.11,370 కోట్ల సమీకరణ!

దేశంలో రెండో అతిపెద్ద ఐపీవో  

ముంబై: ప్రభుత్వ రంగంలోని రీ ఇన్సూరెన్స్‌ సంస్థ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (జీఐసీ) అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 11న ప్రారంభం కానుంది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.855–912గా ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ఈ ఇష్యూ 13వ తేదీతో ముగుస్తుంది. రూ.11,370 కోట్ల మేర సమీకరిస్తున్న ఈ ఐపీఓ... దేశంలో రెండో అతి భారీదిగా చెప్పొచ్చు. 2010లో వచ్చిన కోల్‌ ఇండియా రూ.15,000 కోట్ల ఐపీవో అతిపెద్దది. ఐపీవోలో జీఐసీ 14.22% వాటాను అమ్మకానికి పెడుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 12.26 శాతానికి సమానమైన 10,75,00,000 షేర్లను ఆఫర్‌ చేయనుండగా, 1.96%కి సమానమైన 1,72,00,000 షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనున్నట్లు జీఐసీ చైర్మన్‌ అలైస్‌ జి వైద్యన్‌ పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఐసీ రూ.390 కోట్ల లాభాల్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.704 కోట్ల లాభంలో సగం మేర తగ్గిపోయింది. ప్రధాని సాగు బీమా పథకం రూపంలో ఎదురయ్యే నష్టాల కోసం చేసిన అధిక కేటాయింపులు, బీమా గణన విధానంలో మార్పులే లాభం తగ్గిపోవడానికి కారణాలని వైద్యన్‌ స్పష్టతనిచ్చారు. అయితే, సాగు బీమా పాలసీలకు రీఇన్సూరెన్స్‌ డిమాండ్‌ పెరగడంతో జూన్‌ త్రైమాసికంలో ఆదాయం మాత్రం 189 శాతం పెరిగి రూ.17,195 కోట్లకు చేరింది.

మరిన్ని వార్తలు