సారీ... ధరలే అడ్డొచ్చాయ్! | Sakshi
Sakshi News home page

సారీ... ధరలే అడ్డొచ్చాయ్!

Published Thu, Oct 5 2017 12:09 AM

RBI keeps repo rate unchanged at 6% on back - Sakshi

ముంబై: అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లో ఈ రేటు తగ్గిస్తే, ఆర్‌బీఐ నుంచి పొందే రుణాలకు సంబంధించి బ్యాంకులపై వడ్డీ భారం తగ్గుతుంది. ఈ ప్రయోజనాన్ని కస్టమర్‌కు అందిస్తే, వ్యవస్థలో తక్కువ వడ్డీరేటు వల్ల రుణ వృద్ధి జరిగి,  ఆర్థిక రంగం పురోగమిస్తుందనేది సిద్ధాంతం. అయితే వ్యవస్థలోకి అధిక లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) రావడం వల్ల డిమాండ్‌ పెరిగి ధరలకు కూడా రెక్కలు వస్తాయన్నది మరో కోణం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి సంగతి ఎలా ఉన్నా, సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడతాడు. ఇప్పుడు ఇదే భయాలతో గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలో జరిగిన ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీపీ) నాల్గవ ద్వైమాసిక సమావేశం... రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. కమిటీలో ఐదుగురు ఇందుకు ఓటువేశారు. ఆర్‌బీఐ నిర్ణయాల్లో మరో ముఖ్యమైన అంశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటుకు అరశాతం కోత. ఈ రేటును 6.7%కి పరిమితం చేస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఆగస్టులో ఈ అంచనా 7.3%.  ద్రవ్యోల్బణాన్ని గతంలో 4 శాతం నుంచి 4.5 శాతంగా అంచనావేసిన ఆర్‌బీఐ ఈ రేటునూ ఇప్పుడు 4.2–4.6 శాతం శ్రేణికి పెంచింది.

ఎస్‌ఎల్‌ఆర్‌ తగ్గించినా...
పాలసీ సమీక్షలో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో(ఎస్‌ఎల్‌ఆర్‌)ను ఆర్‌బీఐ అరశాతం తగ్గించింది. దీనితో ఇది 20% నుంచి 19.5%కి తగ్గింది. ఈ నిర్ణయం అక్టోబర్‌ 14వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన మొత్తమే ఈ ఎస్‌ఎల్‌ఆర్‌. ఇప్పుడు దీన్ని తగ్గించడం వల్ల సాంకేతికంగా బ్యాంకుల వద్దకు అదనంగా రూ.57,000 కోట్లు చేరుతాయి. అయితే కొందరు బ్యాంకర్ల విశ్లేషణల ప్రకారం– పలు బ్యాంకులు ఇప్పటికే 20%కి మించి ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టాయి. వ్యవస్థలో డిమాండ్‌ తగ్గిన పరిస్థితుల్లో తాజా నిధులు బ్యాంకింగ్‌కు అందుబాటులోకి వచ్చినా, అవి రుణాల రూపంలోకి మారే పరిస్థితి లేదు. ‘‘జనవరి 1, 2019 నాటికి 100% లిక్విడిటీ కవరేజ్‌ రేషియో (ఎల్‌సీఆర్‌) సర్దుబాటు భాగమే ఈ నిర్ణయం’అని ఆర్‌బీఐ పేర్కొనడం గమనార్హం. ఈ నిర్ణయం తర్వాత బ్యాంక్‌ షేర్లు పెరిగినా, తరువాత యథాతథ స్థితికి వచ్చేయడం గమనార్హం. జూన్‌లోనూ ఎస్‌ఎల్‌ఆర్‌ను ఆర్‌బీఐ అరశాతం తగ్గించింది.

అంబుడ్స్‌మన్‌... వేగవంతం కావాలి!
బ్యాంకింగ్‌ కస్టమర్ల ఫిర్యాదుల విచారణ, నిర్ణయాల్లో మరింత వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని అంబుడ్స్‌మన్‌కు ఆర్‌బీఐ సూచించింది. ఈ నెలాఖరుకు ఈ అంశానికి సంబంధించి అవసరమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని పేర్కొంది.

ఈటీపీలపై దృష్టి...: ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్స్‌పై ట్రేడింగ్‌ విస్తృతమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనా దృష్టి సారిస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ప్రైసింగ్‌ విషయంలో పారదర్శకత, ప్రాసెసింగ్‌లో  సామర్థ్యం పెంపు, రిస్క్‌ నియంత్రణ వంటి అంశాలను మరింత మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు మార్కెట్‌ నిఘా పెంపు, అవాంఛనీయ ట్రేడింగ్‌ విధానాల నియంత్రణ వంటి అంశాలనూ లక్ష్యంగా పెట్టుకుని త్వరలో ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. ఈ ముసాయిదాను ప్రజా సూచనల కోసం అక్టోబర్‌ చివరినాటికి ఆర్‌బీఐ వెబ్‌సైట్‌పై ఉంచుతున్నట్లు తెలిపింది.

తయారీపై జీఎస్‌టీ ప్రతికూలత: తయారీ రంగంపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు క్లిష్టత ప్రతికూల  ప్రభావం పడినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఆయా అంశాలు పెట్టుబడుల పునరుద్ధరణలో ఆలస్యం అయినట్లు వివరించారు. వ్యాపార ప్రక్రియ సరళతరానికి కొత్త పరోక్ష పన్ను వ్యవస్థలో సరళీకరణ జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

ప్రజాకర్షక చర్యలపై అప్రమత్తం
వ్యవసాయ రుణ మాఫీ,  వృద్ధిని పెంచేందుకు ఆర్థిక ఉద్దీపనలు వంటి ప్రజాకర్షక చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ సూచించింది. ఆర్థిక అంశాల పట్ల కొంత సానుకూల ధోరణి ఉందని పేరొంది. కమోడిటీ ధరలు తద్వారా ద్రవ్యోల్బణం తగ్గుదల అవకాశాలను ప్రస్తావించింది.

సీనియర్‌ సిటిజన్స్‌తో ఉదారంగా వ్యవహరించాలి
సీనియర్‌ సిటిజన్స్, దివ్యాంగులతో ఉదారంగా వ్యవహరించాలని, వారి బ్యాంకింగ్‌ అవసరాలను గుర్తించి తగు విధంగా సేవలు అందించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే పేరిట బ్యాంకులకు వచ్చే వారిని తిప్పి పంపేయొద్దని పేర్కొంది. దీనిపై ఈ నెలాఖరున అధికారికంగా ఆదేశాలు జారీ చేయనుంది. బ్యాంకింగ్‌ లావాదేవీల కోసం శాఖలకొచ్చే సీనియర్‌ సిటిజన్స్, దివ్యాంగులకు సరిగా సహకరించకుండా వారిని బ్యాంకులు తిప్పి పంపేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆర్‌బీఐ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు సహకార బ్యాంకులకూ కరెంటు అకౌంట్లు తెరిచేందుకు అనుమతినిస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

పాలసీ ముఖ్యాంశాలు ఇవీ...
►రెపో రేటు 6 శాతంగా యథాతథం
►రివర్స్‌ రెపో 5.75 శాతంగా కొనసాగింపు
►వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 6.7 శాతానికి కోత
►ద్రవ్యోల్బణం ద్వితీయార్ధంలో 4.2–4.6% శ్రేణిలో ఉంటుందని అంచనా
►4 శాతం వద్ద ద్రవ్యోల్బణం కొనసాగేలా తగిన చర్యలు
►తయారీ రంగంపై స్వల్పకాలంలో జీఎస్‌టీ ప్రతికూలత
►మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో పటిష్ట చర్యల కొనసాగింపు
►వాణిజ్య వాతావరణం, పారదర్శకతను పెంపొందించడానికి చర్యలు
►నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణకు తగిన ప్రణాళిక రూపకల్పనపై దృష్టి
►రాష్ట్రాలు వసూలు చేస్తున్న అధిక స్టాంప్‌ డ్యూటీ హేతుబద్ధీకరణకు సూచన
►చౌకధరల గృహాలను అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని
►వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టీకరణ
►తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్‌ 5–6

ఊహించిందే: బ్యాంకర్లు
రేటు తగ్గింపునకు ప్రస్తుతం అవకాశాలు లేవని, ఆర్థిక వ్యవస్థకు ఊపునివ్వడానికి ప్రభుత్వ వ్యయాలే కీలకమని బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ నిర్ణయం ఊహించినట్టే ఉంద న్నారు. ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని, ఇవి ఫలితాలివ్వటానికి కొంత సమయం పడుతుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌ పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. మౌలిక రంగం, చౌక గృహ నిర్మాణాలు, నిలిచి పోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణకు చర్యలు వృద్ధి పురోగతికి దోహదపడతాయని చెప్పారామె. అలాగే బ్యాంకుల మూలధన కల్పనకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఆర్థిక వ్యవస్థల ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి సూక్ష్మ అంశాల పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పాలసీ ఉందని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ చందా కొచర్‌ చెప్పారు. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం కట్టుతప్పకుండా తీసుకుంటున్న చర్యలే దీనికి కారణమని పేర్కొన్నారు. అధిక ద్రవ్యోల్బణ ధోరణి వల్ల రెపో రేటు కోత సాధ్యం కాదని అన్నారు.

నిరాశ కలిగిస్తోంది: కార్పొరేట్లు
ఆర్‌బీఐ రెపో రేటు కోత నిర్ణయం తీసుకోకపోవడం పట్ల పారిశ్రామిక వర్గాలు నిరాశను వ్యక్తం చేశాయి. రేటు తగ్గింపువల్లే డిమాండ్, వృద్ధి సాధ్యమవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ప్రస్తుత మందగమనంలో రేటు కోత తప్పనిసరని తాము భావిస్తున్నట్లు ఫిక్కీ ప్రెసిడెంట్‌ పంకజ్‌ పాటిల్‌ పేర్కొన్నారు. ఆర్‌బీఐ సరళ నిర్ణయం తసుకోవాల్సిందని అసోచామ్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ జజోడియా అన్నారు.

Advertisement
Advertisement