ఎంసీఎక్స్‌ఎక్స్ఛేంజీ చైర్మన్ రాజీనామా

15 Mar, 2014 01:32 IST|Sakshi
ఎంసీఎక్స్‌ఎక్స్ఛేంజీ చైర్మన్ రాజీనామా

 ముంబై/న్యూఢిల్లీ: ఎంసీఎక్స్‌ఎక్స్ఛేంజీచైర్మన్ పదవికి జీకే పిళ్లై రాజీనామా చేశారు. 2008లో ఎక్స్ఛేంజీకి లెసైన్స్ లభించడంపై సీబీఐ దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పిళ్లై రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ అంశానికి సంబంధించి  అప్పట్లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి చైర్మన్‌గా పనిచేసిన భవేపై సీబీఐ ప్రాథమిక విచారణ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పిళ్లై రాజీనామాతో ఎక్స్ఛేంజీ చైర్మన్ పదవిని ఎల్‌ఐసీ మాజీ చైర్మన్, ఎక్స్ఛేంజీ వైస్‌చైర్మన్ థామస్ మాథ్యూ చేపట్టారు. వైస్‌చైర్మన్‌గా ఆషిహా గోయల్ నియమితులయ్యారు.

 పలు సవాళ్ల మధ్య తాను పదవిని చేపట్టానని, ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నానని పిళ్లై చెప్పారు. అయినప్పటికీ ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ టీమ్ ఆధ్వర్యంలో ఎక్స్ఛేంజీ నడుస్తుందని తెలిపారు. ఇకపై ఎక్స్ఛేంజీ సీఈవో సౌరభ్ సర్కార్ మరింత కీలకంగా వ్యవహరించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పిళ్లైసహా నలుగురు సభ్యుల బోర్డును గతేడాది సెబీ నియమించిన విషయం విదితమే. ఎన్‌ఎస్‌ఈఎల్ చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో బోర్డును సెబీ పునర్వ్యవస్థీకరించింది. అయితే ఎక్స్ఛేంజీకి చెందిన ట్రేడింగ్ సభ్యులు, వాటాదారుల ఆందోళనలను తొలగించేందుకు ఇటు ప్రభుత్వం, అటు సెబీ తాజాగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్‌లో ఐఎఫ్‌సీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి.

 రైట్స్ ఇష్యూకి స్పందన
 ఒక షేరుకి రెండు షేర్ల నిష్పత్తిలో చేపట్టిన రైట్స్ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించినట్లు ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్ కొత్త యాజమాన్యం తెలిపింది.  

 శనివారం నో ట్రేడింగ్
 వ్యవసాయ కమోడిటీలలో శనివారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్‌ఎంసీ) నిషేధించింది.  2014 ఏప్రిల్ 1 నుంచి అన్ని రకాల కమోడిటీలలోనూ అన్ని ఎక్స్ఛేంజీలూ శనివారం ట్రేడింగ్ నిర్వహించడాన్ని ఎఫ్‌ఎంసీ తాజాగా నిషేధించింది.

  ఎన్‌బీహెచ్‌సీ విక్రయం
 నేషనల్ బల్క్ హ్యాండ్లింగ్ కార్పొరేషన్(ఎన్‌బీహెచ్‌సీ)ను ఇండియా వ్యాల్యూ ఫండ్ ట్రస్టీకు రూ. 242 కోట్లకు విక్రయించనున్నట్లు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ తెలిపింది. వివిధ ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ టెక్ ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్‌కు సంబంధించి లిస్టింగ్ ఒప్పందంలో భాగంగా ఎన్‌బీహెచ్‌సీను విక్రయిస్తున్నట్లు వెల్లడించింది.

  ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 4.5% పతనమై రూ. 361 వద్ద ముగియగా, ఎంసీఎక్స్ సైతం అదే స్థాయిలో దిగజారి రూ. 493 వద్ద నిలిచింది.

మరిన్ని వార్తలు