వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా?

6 Oct, 2023 05:31 IST|Sakshi

సిసోడియా కేసులో సీబీఐను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఏవైనా ఉన్నాయా? అని సుప్రీంకోర్టు సీబీఐను ప్రశ్నించింది. ఇదే కేసులో నిందితుడైన దినేశ్‌ అరోరా వాంగ్మూలం మినహా ఇంకా ఏం ఆధారాలున్నాయని అడిగింది. మద్యం కుంభకోణం కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని సీబీఐ పేర్కొంది. కొన్ని వాట్సాప్‌ సందేశాలను సాక్ష్యంగా కోర్టుకు సమర్పించింది. ఈ సాక్ష్యం ఆమోదయోగ్యమేనా? అప్రూవర్‌గా మారిన వ్యక్తి ఇచి్చన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా ఎలా భావించగలం? అని కోర్టు వ్యాఖ్యానించింది.

మద్యం కుంభకోణం కేసులో సిసోడియాకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయారని అభిప్రాయపడింది. సిసోడియా ముడుపులు తీసుకున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని, మరి ఆ డబ్బులు ఆయనకు ఎవరిచ్చారు? డబ్బులిచి్చనట్లు ఆధారాలున్నాయా? ఈ కేసులో అరోరా వాంగ్మూలం కాకుండా సాక్ష్యాలున్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.   

సంజయ్‌ సింగ్‌కు ఐదు రోజుల కస్టడీ
బుధవారం అదుపులోకి తీసుకున్న ఆప్‌ నేత ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఈడీ అధికారులు గురువారం ప్రత్యేక కోర్టు జడ్జి నాగ్‌పాల్‌ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో మిగతా నిందితులతో కలిపి ఆయన్ను విచారించాల్సి ఉందని ఈడీ పేర్కొంది. దీంతో జడ్జి నాగ్‌పాల్‌ ఆయన్ను విచారణ నిమిత్తం అయిదు రోజుల ఈడీ కస్టడీకి పంపుతూ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా జడ్జి అనుమతి మేరకు సంజయ్‌ సింగ్‌ కోర్టులో మాట్లాడారు.

మరిన్ని వార్తలు