పసిడి జోరుకు బ్రేక్!

16 Feb, 2016 01:24 IST|Sakshi
పసిడి జోరుకు బ్రేక్!

లాభాల స్వీకరణతో వెలవెల!
దేశీయ, అంతర్జాతీయ
మార్కెట్లలోనూ ఇదే ధోరణి...

 న్యూయార్క్/ముంబై: వారం రోజులుగా ఉరుకులు పరుగులు పెట్టిన పసిడి నుంచి ఇన్వెస్టర్లు సోమవారం లాభాలు స్వీకరిస్తున్నారు. కడపటి సమాచారం అందే సరికి నెమైక్స్ గోల్డ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోల్చితే 35 డాలర్లు తగ్గి 1,205 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్‌లో సైతం కడపటి సమాచారం అందేసరికి 10 గ్రాముల పసిడి ధర 724 నష్టంతో రూ.28,662 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర వెయ్యి రూపాయలకుపైగా నష్టంతో రూ.36,970 వద్ద ట్రేడవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పసిడి ధర మంగళవారం దేశీయ స్పాట్ మార్కెట్లో పడిపోయే అవకాశం ఉంది.

 ఇతర కారణాలు ఏమిటంటే...
 జపాన్, యూరప్‌లు ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపనలను ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు కూడా పసిడి క్షీణతకు ఒక కారణం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన తగ్గి, పసిడి నుంచి నిధులను వెనక్కు తీసుకోడానికి దోహదపడుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 స్పాట్ మార్కెట్‌లో భారీ తగ్గుదల: గత వారం స్పాట్ మార్కెట్‌లో  10 గ్రాములకు రూ. 1,700 వరకూ పెరిగిన పసిడి ధర సోమవారం భారీగా తగ్గింది. ముంబై స్పాట్ మార్కెట్‌లో 99.9 ప్యూరిటీ ధర రూ.695 తగ్గి రూ. 28,565 వద్ద ముగిసింది. 99.5 ప్యూరిటీ ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ. 28,415 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర సైతం రూ.965 పడిపోయి 37,210 వద్దకు చేరింది.

 పసిడి, వెండి టారిఫ్ ధరల పెంపు
 పసిడి దిగుమతుల టారిఫ్ ధరను సోమవారం ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ 388 డాలర్ల నుంచి 403 డాలర్లకు పెంచింది. వెండి ధరను కేజీకి 487 డాలర్ల నుంచి 510 డాలర్లకు పెంచింది.

>
మరిన్ని వార్తలు