నిర్మించి నిరుపయోగం చేశారు..! | Sakshi
Sakshi News home page

నిర్మించి నిరుపయోగం చేశారు..!

Published Tue, Feb 16 2016 1:18 AM

నిర్మించి నిరుపయోగం చేశారు..!

వివిధ డిగ్రీ కళాశాలల్లో వసతిగృహాలకు భవనాల నిర్మాణం
మూడేళ్లయినా హాస్టల్స్ ఏర్పాటు చేయని అధికారులు
నిరుపయోగంగా భవనాలు.. ప్రైవేట్ కార్యకలాపాలకు వినియోగం

  
 నిడదవోలు :జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాలుగేళ్ల క్రితం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం నిర్మించిన వసతిగృహాల భవనాలు నిరుపయోగంగా మారాయి. లక్షల రూపాయలతో భవనాలను నిర్మించినా వాటిలో హాస్టల్స్ నిర్వహించకపోవడంతో అవి విద్యార్థులకు అక్కరకు రాకుండా పోయాయి. దీంతో ఆ భవనాలు ప్రైవేట్ వ్యక్తుల కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయి. వాటిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


 2012లో నిధులు మంజూరు
జిల్లాలో నిడదవోలు, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సంక్షేమ వసతి గృహాల నిర్వహించేందుకు భవనాల నిర్మాణానికి యూసీజీ నిధులు మంజూరు చేసింది. నిడదవోలు పట్టణంలో వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో రూ. 58.75 లక్షలతో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. కింద నాలుగు విశాలమైన గదులు, పై అంతస్తులో రెండు గదులతో పాటు డైనింగ్ హాలును నిర్మించారు. 2013లో అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ కళాశాలలో 500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పట్టణ చుట్టుపక్కల 48 గ్రామాల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు ఈ కళాశాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి హాస్టల్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావించారు. అయితే అప్పటి నుంచి భవనంలో హాస్టల్ ఏర్పాటు చేయలేదు. నిడదవోలు పట్టణ శివారున ఉన్న ఎస్వీఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా 2010లో యూజీసీ నిధులు రూ.20 లక్షల వ్యయంతో వసతిగృహం నిర్మించారు. కానీ ఇప్పటికి కూడా హాస్టల్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారింది.


పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో..
ఇదే విధంగా జిల్లాలోని పాలకొల్లు దాసరి నారాయణరావు మహిళా డిగ్రీ కళాశాలలో రూ.60 లక్షలతో వసతి గృహ భవనం నిర్మించారు. ఇదే పట్టణంలోని అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.60 లక్షలతో నిర్మించిన వసతి గృహ భవనం కూడా నిరుపయోగంగా మారింది. తణుకు చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, తాడేపల్లిగూడెం డీఆర్‌జీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా నిర్మించిన హాస్టల్ భవనాలు నిరుపయోగంగానే మారాయి. దాదాపుగా ఈ భవనాలన్నింటిలో ప్రస్తుతం ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం. భవనాలు ఖాళీగా ఉండడంతో యోగా, వ్యాయామం క్లాసులు, ఇతర కార్యక్రమాలకు వివిధ సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. కనీసం తాళాలు కూడా వేయకపోవడంతో రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. భవనాల కిటికీలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి.  

అద్దె భవనాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్స్మరోవైపు ఇవే పట్టణాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండడం గమనార్హం. నిడదవోలు పట్టణంలో చాలా కాలం నుంచి ఎస్సీ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖకు చెందిన ఇంటర్ విద్యార్థుల వసతి గృహలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. పట్టణంలోని రాయిపేటలోని బీసీ సంక్షేమ శాఖ హాస్టల్‌ను 2008 నుంచి అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంటర్, డిగ్రీ, బీఈడీ విద్యార్థులు కూడా ఉంటున్నారు. నెలకు రూ.20 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. కనీసం ఆ హాస్టల్‌ను డిగ్రీ కళాశాలలో నిర్మించిన భవనానికి తరలిస్తే ప్రభుత్వానికి అద్దె మిగలడంతో పాటు కళాశాల విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందని పట్టణ ప్రజలు సూచిస్తున్నారు.
 
హాస్టల్ ప్రారంభించేందుకు చర్యలు
కళాశాలలో మూడేళ్ల క్రితం యూజీసీ నిధులతో హాస్టల్ భవనం నిర్మించారు. ఏడాది క్రితం కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదాకు యూజీసీ అధికారులకు నివేదిక పంపించాం. అనుమతులు రాగానే హాస్టల్ ప్రారంభించేందుకు కృషి చేస్తాం.
 - డాక్టర్ ఎస్‌కే ఇమాంఖాసీం, ప్రిన్సిపల్, ఎస్వీడీ డిగ్రీ కళాశాల, నిడదవోలు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement