ఆటో మొబైల్‌ పరిశ్రమకు భారీ ఊరట

22 Aug, 2019 14:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  దేశీయ ఆటో పరిశ్రమకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్పిడికి ఎలాంటి గడువు లేదని తేల్చి చెప్పారు. ఇ-వాహనాల పరివర్తన సహజంగా జరుగుతుందని  స్పష‍్టం చేశారు. దాదాపు ఏడాది కాలంగా మందగమనంలో విలవిల్లాడుతూ, విక్రయాలు 19ఏళ్ల గరిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో  ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలుకు గడ్కరీ ప్రకటన భారీ ఊరటనివ్వనుంది.

2023 నుంచి 150 సీసీ లోపు  ద్విచక్రవాహనాలు, 2025 నాటికి త్రిచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా పూర్తిగా మారాలని ప్రభుత్వ థింక్-ట్యాంక్  నీతి ఆయోగ్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పందించాల్సిందిగా కేంద్రమంత్రిని కోరినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు.  పెట్రోల్, డీజిల్ వాహనాలను ఈ గడువులోగా నిషేధించాలనే గడువు లేదని, అలాంటిదేమైనా వుంటే సంబంధిత వర్గాలను సంప్రదించిన తరువాతే  నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి మాత్రం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. పరివర్తన సహజ ప్రక్రియగా జరుగుతుందన్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ప్రయత్నంలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఇంజన్లను నిషేధించదని లోక్‌సభ సమావేశాల్లో కూడా గడ్కరీ ఆటోమొబైల్ పరిశ్రమకు హామీ ఇచ్చిన సంగతి గమనార్హం.

ఈవీ వాహనాల పరివర్తన గడువుపై ఆటోమొబైల్ మేజర్స్ టీవీఎస్‌ మోటార్  బజాజ్ ఆటో కూడా ఇలాంటి ఆకస్మికంగా ఈ మార్పును సాధించలేమని టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ ఇంతకుముందే వెల్లడించారు. ఈ విషయంలో దేశం, ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ రెండూ చాలా దూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఫలితంగా 4 మిలియన్ల ఉద్యోగాలను కల్పిస్తున్న ఆటోమొబైల్‌ పరిశ్రమ దెబ్బతింటుందని శ్రీనివాసన్ తెలిపారు.

కాగా గత కొన్ని నెలలుగా ఆటో పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. డిమాండ్‌ క్షీణించి తో ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధిలో మందగమనంలో ఉందని, గత కొన్ని నెలలుగా ఆటో కాంపోనెంట్స్ రంగంలో లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నివేదికలు వెలువడ్డాయి. అటు ఈ ధోరణి మరో  మూడు నాలుగు నెలలు కొనసాగితే, 10లక్షలకు పైగా ఉద్యోగనష్టాలకు దారితీస్తుందని ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎసిఎంఎ) డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా  వ్యాఖ్యానించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల ప్రకారం, ఆటో పరిశ్రమ గత సంవత్సరంతో పోల్చితే 2019 లో అమ్మకాలలో 31శాతం తగ్గుదల నమోదైంది.

మరిన్ని వార్తలు