‘ఇంద్రాణి స్టేట్‌మెంట్‌తో చిదంబరానికి చిక్కులు’

22 Aug, 2019 14:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం అరెస్ట్‌పై సీబీఐ, కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఎండగట్టింది. చిదంబరం ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆయనను టార్గెట్‌ చేశారని ఆరోపించింది. చిదంబరంపై నమోదైన ఆరోపణలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని దర్యాప్తు సంస్థ అధికారులను సవాల్‌ చేసింది. చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలను లక్ష్యంగా చేసుకున్న సీబీఐ అధికారులు కార్తీ చిదంబరంపై నాలుగు సార్లు దాడులు చేయడంతో పాటు 20 సార్లకు పైగా సమన్లు జారీ చేసి వేధించారని మండిపడింది.

అప్రూవర్‌గా మారి ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న మహిళ స్టేట్‌మెంట్‌పై ఆధారపడి సీబీఐ ఈ కేసులో  విచారణ సాగిస్తోందని కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జీవాలా దుయ్యబట్టారు. కుమార్తెను హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నమహిళపై విశ్వాసం ఉంచిన సీబీఐ చిదంబరంపై భరోసా లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. సొంత కుమార్తెను హత్య చేసిన ఆరోపణలున్న మహిళ స్టేట్‌మెంట్‌ ఆధారంగా సీనియర్‌ రాజకీయ నేతను అరెస్ట్‌ చేశారని పరోక్షంగా ఇంద్రాణి ముఖర్జియాను ప్రస్తావిస్తూ సుర్జీవాలా సీబీఐపై విరుచుకుపడ్డారు. కుమార్తెను హత్య చేసిన కేసులో ఐఎన్‌ఎక్స్‌ మీడియా అధిపతులైన పీటర్‌, ఇంద్రాణి ముఖర్జియా దంపతులు 2015 ఆగస్ట్‌లో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా