తొలి మహిళా ఫోటో జర్నలిస్టుకు గూగుల్‌ నివాళి

9 Dec, 2017 18:44 IST|Sakshi

స్పెషల్‌ డూడుల్స్‌తో వివిధ విశిష్ట వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తు చేసుకునే గూగుల్‌  తాజాగా మరో ఆసక్తికరమైన డూడుల్‌ను తయారు చేసింది. భారతదేశంలోనే  తొలి మ‌హిళా ఫోటో జర్నలిస్టు  హోమాయ్  వ్యరవాల్లకు  నివాళిగా  డూడుల్‌ని ప్రదర‍్శించింది.  డిసెంబర్‌ 9  ఆమె 104వ  జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్‌తో ఆమెకు ఘన నివాళులర్పించింది.  ముంబై కళాకారుడు సమీర్ కులవూర్ ఈ డూడుల్‌ ను రూపొందించారు.

గుజరాత్ నవ్సారిలో హోమాయ్ జన్మించారు.  సెయింట్ జేవియర్స్ కాలేజీలో డిప్లొమా  అనంతరం ఉన్నత చదువుల కోసం ముంబై వెళ్లారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ మానెక్సా  పెళ్లి చేసుకున్నారు. తన భర్త నుంచే హొమాయ్ ఫోటోగ్రఫీని  నేర్చుకున్నారు. 1942 లో ఆమె బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో పూర్తికాల ఉద్యోగిగా చేరారు. బ్రిటీష్ కాలం నుంచి భారత్‌కు స్వాతంత్రం వచ్చేంత వరకు తను ఫోటోగ్రాఫర్‌గా దేశానికి విశిష్ట సేవలను అందించారు.  ముఖ్యంగా 1947 ఆగస్ట్ 15న  తొలి పతాకావిష్కరణ సందర్భంగా మహాత్మా గాంధీ,  జవహర్‌ లాల్‌ నెహ్రూ లాంటి  జాతీయ నాయకుల ఫోటోలు బాగా పాపులర్‌ అయ్యాయి. అలాగే ఇండియానుంచి లార్డ్ మౌంట్ బాటన్ నిష్క్రమణతోపాటు, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహానుభావుల అంతిమ యాత్రలను హొమాయ్ కవర్ చేశారు. క్వీన్ ఎలిజెబిత్, యూఎస్ మాజీ అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్‌హోవర్ భారత్‌ను పర్యటించినప్పడు కూడా వాళ్ల ఫోటోను హొమాయే తీశారు. హొమాయ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2011లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది. సబీన్ గాడిహోక్ అనే ఆమె సన్నిహితులొకరు సాహసోపేత మహిళగా ఆమెను అభివర్ణించడం విశేషం.

రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభంలో ఒక ఫోటో జర్నలిస్టుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన హోమాయ్ ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాకు పనిచేశారు.  అయితే 1938లో ముంబై మహిళల క్లబ్‌లో మహిళల పిక్నిక్ పార్టీ​కోసం  తీసిన ఫోటో మొదటి ఫోటో. కాగా  'బొంబాయి క్రానికల్' లో  తొలి ఫోటో ప్రచురితమైంది. దీనికి   ఆమె ఒక రూపాయిని  పత్రిక చెల్లించింది.  దాల్డా 13పేరుతో ఆమె ఫోటోలను పబ్లిష్‌ చేసేవారు. జనవరి 15, 2012 న  98 సంవత్సరాల వయసులో  హోమాయ్  తుదిశ్వాస విడిచారు.

 

మరిన్ని వార్తలు